Roja: జగన్ రాష్ట్రంలో లేరని కుట్రలు చేస్తే కుదరదు.. తప్పు చేసిన వారిని విడిచిపెట్టం: మంత్రి రోజా

Pawan Kalyan read Chandrababu script says Roja

  • కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే హింసకు పాల్పడటం బాధాకరమన్న రోజా 
  • చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదివారని విమర్శ 
  • అమలాపురం ఘటన వెనుక ఎవరున్నారో ప్రజలు గుర్తించాలన్న మంత్రి  

అమలాపురంలో వైసీపీకి చెందిన ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టడం దారుణమని ఏపీ మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే హింసకు పాల్పడటం బాధాకరమని అన్నారు. అంబేద్కర్ వల్లే మనందరం సంతోషంగా ఉన్నామని.. అలాంటి గొప్ప వ్యక్తి పేరు జిల్లాకు పెడితే దాడులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. 

అసలు అంబేద్కర్ పేరు పెట్టాలని ఇవే ప్రతిపక్షాలు గతంలో నిరాహారదీక్షలు కూడా చేశాయని చెప్పారు. వైపీసీ ప్రభుత్వ పాలనపై బురద చల్లేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు. 

దాడికి పాల్పడిన వారిలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని రోజా చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటామని టీవీల ముందుకు వచ్చిన వారు జనసేనాని పవన్ కల్యాణ్ కు ఎంత సన్నిహితంగా ఉన్నారో తెలుస్తోందని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారని విమర్శించారు. తుని ఘటనలో వైసీపీ వాళ్లు ఉన్నట్టయితే, మరి మీ పాలనలో ఎందుకు అరెస్ట్ చేయించలేదని ఆమె ప్రశ్నించారు. 

అమలాపురం ఘటన వెనుక ఎవరున్నారో ప్రజలు గుర్తించాలని అన్నారు. కోనసీమ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రంలో లేరని కుట్రలు చేస్తే కుదరదని... ఆయన ఎక్కడున్నా ఆయన దృష్టి మొత్తం ఏపీ మీదే ఉంటుందని అన్నారు. దావోస్ పర్యటనలో వున్న జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News