Mohammed Hafeez: పాకిస్థాన్ లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ ఆవేదన!
- లాహోర్ బంకుల్లో పెట్రోల్, ఏటీఎంలో డబ్బులు లేవంటూ హఫీజ్ ఆగ్రహం
- రాజకీయ నాయకుల వల్ల ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్న
- పాక్ తరపున 12 వేల పరుగులు చేసిన హఫీజ్
పాకిస్థాన్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆ దేశ క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకాలం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యవహార తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించిన హఫీజ్... ఇప్పుడు దేశంలోని దుర్భర పరిస్థితులపై రాజకీయ నేతలను ప్రశ్నిస్తూ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
లాహోర్ లోని బంకుల్లో పెట్రోల్ లేదని, ఏటీఎంలలో నగదు లేదని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నాడు. రాజకీయ నాయకుల నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించాడు. ఈ ట్వీట్ ను ప్రధాని హెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లతో పాటు పలువురు రాజకీయ నేతలను ట్యాగ్ చేశాడు.
మొహమ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అంతేకాదు, పాక్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 12 వేల పరుగులను చేయడంతో పాటు, 250 వికెట్లు తీశాడు.