Japan: రూ. 12 లక్షలు ఖర్చు చేసి శునకంలా మారిపోయి.. జీవిత కలను సాకారం చేసుకున్న జపాన్ వ్యక్తి.. వీడియో ఇదిగో!
- టోకో ఇవీని కోలీ జాతి శునకంలా మార్చేసిన ‘జెప్పెట్’
- అందుకోసం 40 రోజులు కష్టపడిన సంస్థ
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియో
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఈ జపాన్ వ్యక్తిని చూస్తే ఇది అవునని అనిపించకమానదు. జంతువులా కనిపించాలన్న తన జీవితకాల స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు అతడు 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ శునకంలా మారిపోయాడు. వినడానికి, నమ్మడానికి కాస్తంత ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా నిజం. సోషల్ మీడియాలో ఇప్పుడా ‘శునకం’ ఫొటోలు తెగ తిరుగుతున్నాయి. చూసిన వారు ఔరా! అని నోరెళ్లబెడుతున్నారు.
ప్రతి ఒక్కరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెప్పెట్ అనే సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం శిల్పాలను తయారుచేస్తూ ఉంటుంది. మస్కట్ పాత్రల దుస్తులను కూడా డిజైన్ చేస్తుంది. ఇటీవల ఆ సంస్థను ఆశ్రయించిన టోకో ఇవీ అనే వ్యక్తి తాను శునకంలా కనిపించాలనుకుంటున్నానని చెప్పాడు. ఇందుకు ఎంత ఖర్చయినా పర్వాలేదని చెప్పాడు.
అందుకు అంగీకరించిన జెప్పెట్.. 40 రోజులపాటు కష్టపడి అతడిని కోలీ జాతి శునకంలా మార్చేసింది. మేకప్, ఇతర ఖర్చుల నిమిత్తం టోకో 2 మిలియన్ యెన్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 12 లక్షలు) సమర్పించుకున్నాడు. అయితే, ఈ శునకం అవతారంలో ఎన్ని రోజులు ఉంటానన్న విషయాన్ని అతడు వెల్లడించలేదు. తాను శునకంలా మారిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేయగా, ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.