Ravi Shastri: రాహుల్ చాన్స్ తీసుకుని ఉండాల్సింది: రవిశాస్త్రి
- హుడా అదే పనిచేశాడన్న శాస్త్రి
- మధ్య ఓవర్లలో మరిన్ని పరుగులు రాబట్టాల్సిందన్న మాజీ కోచ్
- అప్పుడు ఆర్సీబీపై ఒత్తిడి పెరిగేదని వ్యాఖ్య
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్య సాధనకు అనుసరించిన విధానాన్ని మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తప్పుబట్టాడు. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు 14 పరుగుల తేడాతో ఓటమి పాలవడం తెలిసిందే.
ముఖ్యంగా మధ్య ఓవర్లలో రాహుల్ బ్యాటింగ్ తీరుపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. పవర్ ప్లేలో ఈ జట్టు 62 పరుగులతో మెరుగైన స్థితిలోనే కనిపించింది. కానీ, 7 నుంచి 13 ఓవర్ల మధ్య కేవలం 49 పరుగులే రాబట్టుకుంది. అంటే మధ్యలో నత్తనడక చందాన్ని తలపించింది. ‘‘వారు ఇంకొంచెం ముందు మేల్కొని ఉండాల్సింది. మరింత ఓపికగా వేచి చూస్తే.. 9, 14 ఓవర్ల మధ్య రాహుల్ భాగస్వామ్యం ప్రత్యర్థి లక్ష్యంగా మారింది.
కేఎల్ రాహుల్ మరికొన్ని చాన్స్ లు తీసుకుని ఉండాల్సింది. ఎందుకంటే హుడా అదే పనిచేశాడు. చివరి ఓవర్లలో హర్షల్ మళ్లీ వస్తాడు. కనుక 9-14 ఓవర్ల మధ్యే ఎవరో ఒకరి బాల్ ను లక్ష్యంగా చేసుకుని బాదాల్సింది. అవసరమైన పరుగులను మధ్యలోనే రాబట్టి ఉంటే అది ఆర్సీబీని ఒత్తిడికి గురి చేసే ఉండేది’’ అని రవిశాస్త్రి అన్నాడు.