Konaseema District: అమలాపురం అల్లర్లలో 46 మందిపై కేసు... జాబితాలో బీజేపీ, కాపు ఉద్యమ నేతలు
- బీజేపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సుబ్బారావుపై కేసు
- బీజేపీ నేత రాంబాబు, కాపు ఉద్యమ నేత కుమారుడిపైనా కేసు
- మరింత మందిపై కేసులు నమోదు దిశగా పోలీసులు
కోనసీమ జిల్లా పేరు మార్పుపై నెలకొన్న వివాదం నేపథ్యంగా జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటిదాకా 46 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు... మరింత మందిపైనా కేసులు నమోదు చేసే దిశగా సాగుతున్నారు. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో బీజేపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచందర్ రావు కుమారుడు అజయ్ ఉన్నారు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. పలు రాజకీయ పార్టీలు కూడా ఇదే వాదనను వినిపించాయి.
ఈ క్రమంలో జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాల కోసం 30 రోజుల గడువును విధించింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తున్న కొందరు రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పొన్నాడ సతీశ్ ఇళ్లపై నిరసనకారులు దాడి చేసిన సంగతి తెలిసిందే.