Harish Rao: మోదీ 'కుటుంబ పాలన' వ్యాఖ్యలు... అమిత్ షా తనయుడు బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడన్న హరీశ్ రావు
- హైదరాబాదులో మోదీ పర్యటన
- టీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు
- మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న హరీశ్ రావు
- సిల్వర్ జూబ్లీ కోసం వచ్చి చిల్లర మాటలు మాట్లాడారని విమర్శలు
హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించాయి. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ఓ కుటుంబం స్వలాభం పొందుతోందన్న సంగతిని యావత్ దేశం గమనిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మోదీ చిల్లర మాటలు మాట్లాడారని హరీశ్ రావు విమర్శించారు.
మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం మోదీ మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. మోదీ నోట కుటుంబ పాలన మాట రావడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. అమిత్ షా తనయుడు ఏమైనా క్రికెట్ ఆటగాడా? ఆయన బీసీసీఐకి ఎలా కార్యదర్శి అయ్యాడు? అని హరీశ్ రావు నిలదీశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదని, తెలంగాణను ఓ కుటుంబంలా భావించి పాలిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని హరీశ్ రావు పేర్కొన్నారు.