Rahul Gandhi: ఇంటర్వ్యూలో అనుకోని ప్రశ్న.. సమాధానం చెప్పేందుకు సమయం తీసుకున్న రాహుల్ గాంధీ!

Rahul Gandhi At Cambridge Raises Involvement Of Deep State In India

  • బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ
  • హింస, అహింస అనే అంశంపై ప్రశ్న
  • సమాధానం ఇచ్చేందుకు కొంత సమయం తీసుకున్న రాహుల్
  • బీజేపీ విమర్శల దాడి

బ్రిటన్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓ ఇంటర్వ్యూలో అనుకోని ప్రశ్న ఎదురైంది. దీంతో సమాధానం చెప్పేందుకు ఆయన కొంత తడబడ్డారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన ఇంటర్వ్యూలో ఆయనీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. భారతీయ సమాజంలో హింస, అహింస అనే అంశంపై ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి రాహుల్‌ను ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కొంత సమయం తీసుకున్న రాహుల్.. ఈ విషయంలో తనకు తొలుత క్షమాపణ అనే పదం గుర్తొస్తుందని అన్నారు. ఇది కచ్చితమైనదేమీ కాదంటూ పూర్తి చేసేందుకు కొంత సమయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. దానిని ఛేదించేందుకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. దీంతో వారివైపు తిరిగిన రాహుల్.. దీనిపై సమాధానం చెప్పేందుకు తాను ఆలోచిస్తున్నట్టు చెప్పారు. 

అప్పుడు కల్పించుకున్న ఇంటర్వ్యూ చేస్తున్న మహిళా జర్నలిస్టు.. మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయడం తన ఉద్దేశం కాదని, గతంలో మిమ్మల్ని ఎవరూ ఈ ప్రశ్న అడిగి ఉండకపోవచ్చని అన్నారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. అలా ఏం లేదని, తానేమీ ఇబ్బంది పడలేదని, దీనిపై మరింత లోతుగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ కావడంతో బీజేపీ విమర్శల దాడి చేసింది. 

ఈ వీడియోను ట్వీట్ చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయ.. ముందుగా రాసిపెట్టుకున్న అంశాలపై మాట్లాడాలని రాహుల్‌ను ఎద్దేవా చేశారు. దీనిపై కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదుల దాడుల్లో నానమ్మ, తండ్రిని కోల్పోయిన బాధను బీజేపీ మిత్రులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానని, ఆయనకు ఎదురైన ప్రశ్నకు క్షమాపణ అన్న ఒకే ఒక్క పదంతో వివరించారని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అహింస అనే గాంధీ సిద్ధాంతాన్ని తక్కువ చేయొద్దని బీజేపీకి సూచించారు.

  • Loading...

More Telugu News