Aryan Khan: షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
- ఎటువంటి ఆధారాలను గుర్తించని దర్యాప్తు విభాగం
- అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలపై లభించని ఆధారాలు
- ఆర్యన్ పేరు లేకుండానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చార్జ్ షీటు
సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు విముక్తి లభించింది. కార్డీలియా క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో ఆర్యన్ ఖాన్ పేరు పేర్కొనలేదు.
క్రూయిజ్ (ఓడ) డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబర్ లో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసులో 26 రోజుల సుదీర్ఘ కస్టడీని ఆర్యన్ ఖాన్ ఎదుర్కొన్నాడు. చివరికి బాంబే హైకోర్టు అతడికి 2021 అక్టోబర్ 28న బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 30న జైలు నుంచి విడుదల కాగా, తాజాగా కేసు నుంచి కూడా విముక్తి లభించింది.
ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రకటించింది. అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ తో ఆర్యన్ కు సంబంధాలపై ఆధారాలు లభించలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.