Mopidevi Venkataramana: ఎన్టీఆర్ పేరును స్మరించే హక్కు చంద్రబాబుకు లేదు: ఎంపీ మోపిదేవి
- జెండాలు మోసేందుకే చంద్రబాబుకు బీసీల అవసరమన్న మోపిదేవి
- జగన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారని ప్రశంస
- సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న మోపిదేవి
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పేరును స్మరించే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎన్టీఆర్ కష్టపడి స్థాపించిన పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఆయన మరణానికి కారకుడయ్యారని మోపిదేవి ఆరోపించారు.
ఇక జెండాలు మోసేందుకే బీసీలను చంద్రబాబు వాడుకున్నారన్న ఆయన... సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులో పార్టీ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిలతో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబుపై మోపిదేవి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు.. ఎన్టీఆర్ జపం చేయకుండా, ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారని మోపిదేవి ఆరోపించారు. శత జయంతి ఉత్సవాలు ఎవరైనా చేయవచ్చునని కూడా ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు, టీడీపీ నేతలకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు సీఎంగా పని చేసిన సమయంలో ఏ రోజు కూడా సామాజిక న్యాయం పాటించలేదన్న మోపిదేవి... రాజకీయపరంగా కూడా చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు స్వార్థపూరిత విధానాలతో నిర్ణయాలు తీసుకున్నారే కానీ, బీసీ నాయకుల ప్రాధాన్యత, ప్రాతినిధ్యాన్ని గుర్తించలేదని ఆయన విమర్శించారు.
ఓటుకు నోటు కేసు ప్రస్తావన వస్తే ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేస్తుందోనని రాత్రికి రాత్రి ఏపీకి పరారైన వ్యక్తి చంద్రబాబు అని మోపిదేవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కేసులు వచ్చినా ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటారని కూడా ఆయన విమర్శించారు.
వైఎస్ జగన్ ఎప్పుడూ తప్పుడు కేసుల విషయంలో వెనుకడుగు వేయకుండా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వాన్ని చాలెంజ్ చేసి ప్రజల మధ్యలో నిలిచి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారని జగన్‌ను ప్రశంసించారు. పారిపోవడం చంద్రబాబు నైజం అయితే.. నీతీనిజాయతీగా ఎదుర్కొనే నైజం జగన్‌దని ఆయన పేర్కొన్నారు. జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి, చంద్రబాబుకు లేదని మోపిదేవి అన్నారు.