KTR: ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్!... తెలంగాణకు వచ్చిన పెట్టుబడులెంతంటే..!
- ముగిసిన దావోస్ సదస్సు
- ఫలవంతమైందన్న కేటీఆర్
- తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి
తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఆ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ వేదికగా ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. గురువారంతో సదస్సు ముగియగా... శుక్రవారం కూడా స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్‌లో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసిన కేటీఆర్... శుక్రవారం సాయంత్రం తన దావోస్ పర్యటన ముగిసినట్లుగా ప్రకటించారు.
5 రోజుల పాటు కొనసాగిన దావోస్ సదస్సులో తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు కేటీఆర్ తెలిపారు. సదస్సులో 45 బిజినెస్ మీటింగ్‌లు. 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్యానెల్ డిస్కషన్ల ద్వారా ఈ పెట్టుబడులను సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తంగా దావోస్ ఫలవంతమైందని కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటనతో పాటు అంతకుముందు ఆయన లండన్‌లో జరిపిన పర్యటనను కూడా యాడ్ చేసి తన టూర్‌ను 10 రోజుల ట్రిప్‌గా అభివర్ణించారు.