KCR: ఫామ్ హౌస్ కి వెళ్లిన కేసీఆర్

KCR went to farm house

  • నిన్న సాయంత్రం ఫామ్ హౌస్ కు చేరుకున్న కేసీఆర్
  • వచ్చే నెల  2 లేదా 3న రాలేగావ్ సిద్ధికి వెళ్లే అవకాశం
  • సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న సీఎం

దేశంలోని పలు ప్రాంతాల పర్యటనలో ఇటీవల బిజీగా గడిపిన కేసీఆర్ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం తన ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. గురువారం నాడు ఆయన బెంగళూరుకు వెళ్లి అదే రోజు రాత్రికి తిరిగి వచ్చారు. బెంగళూరు పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయి జాతీయ రాజకీయాలపై చర్చించారు. 

హైదరాబాదుకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన రెండు వివాహాలకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం ఆయన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేను కలవడానికి రాలేగావ్ సిద్ధికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆ పర్యటన రద్దయింది. వచ్చే నెల 2 లేదా 3న ఆయన రాలేగావ్ సిద్ధికి వెళ్లే అవకాశం ఉంది.  

మరోవైపు ఈరోజు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడు సురవరం అని సీఎం కొనియాడారు. 

తెలంగాణపై వివక్షను నాడే ఎదిరించి గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డ అని సీఎం కొనియాడారు. తెలంగాణ సాధన పోరాటంలో సురవరం స్ఫూర్తి ఇమిడి వుందని సీఎం అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. సురవరం సేవలకు గుర్తుగా ఆయన పేరుతో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ పురస్కారాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నామని సీఎం తెలిపారు.

  • Loading...

More Telugu News