TDP Mahanadu: నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే ఆనం కూతురు కైవల్యా రెడ్డి భేటీ
- వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆనం రామనారాయణరెడ్డి
- వైసీపీలో ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తిలో ఆనం
- ఈ క్రమంలోనే నారా లోకేశ్‌తో భేటీకి కుమార్తెను పంపినట్లు సమాచారం
- ఆత్మకూరు ఉప ఎన్నికలో అవకాశం కల్పించాలన్న కైవల్యారెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో తన భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వచ్చిన కైవల్యా రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా త్వరలో జరగనున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆమె లోకేశ్‌ను కోరినట్లు సమాచారం. దీనిపై లోకేశ్ ఎలా స్పందించారన్నది తెలియరాలేదు.
ఇదిలా ఉంటే... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలగిన ఆనం... ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత కూడా ఆయన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలోనూ కీలక మంత్రిగానే వ్యవహరించారు. రాష్ట్ర విభజన తరవాత 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో ఆనం కూడా ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో 2014 తర్వాత టీడీపీలో చేరిన ఆనం... ఆ తర్వాత 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల సమయంలో ఆత్మకూరు అసెంబ్లీ టికెట్‌ను ఆనం కోరగా...ఆయనకు వెంకటగిరి టికెట్‌ను వైసీపీ ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలో వేరే ప్రత్యామ్నాయం లేక వెంకటగిరి నుంచే బరిలోకి దిగిన ఆనం వైసీపీ హవాలో గెలిచిపోయారు. అయితే సీనియర్ అయిన తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన ఆనంకు నిరాశే ఎదురైంది. తాజాగా ఇటీవలే జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ జగన్ అవకాశం ఇవ్వలేదు.
ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం... తన కూతురును ఆయన నారా లోకేశ్ తో భేటీకి పంపినట్టుగా ప్రచారం సాగుతోంది. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఇలాంటి కీలక తరుణంలో కైవల్యా రెడ్డి నేరుగా నారా లోకేశ్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.