Shehbaz Sharif: "నేనొక పిచ్చోడ్ని".... కోర్టులో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు

Pakistan PM Shehbaz Sharif terms himself a crazy man

  • గతంలో పంజాబ్ సీఎంగా షాబాజ్ షరీఫ్
  • భారీ ఎత్తున మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు
  • దర్యాప్తు జరుపుతున్న ఎఫ్ఐఏ
  • స్పెషల్ కోర్టులో విచారణ

పాకిస్థాన్ నూతన ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇవాళ లాహోర్ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కుంభకోణంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నేడు విచారణ సందర్భంగా షాబాజ్ షరీఫ్ కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో పంజాబ్ ప్రావిన్స్ కు ముఖ్యమంత్రిగా పనిచేశానని, అప్పట్లో తాను వేతనం కూడా తీసుకోలేదని వెల్లడించారు. పన్నెండున్నరేళ్లుగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, కానీ ఈ కేసులో తనపై మనీలాండరింగ్ ఆరోపణలు మోపారని ప్రధాని షాబాజ్ షరీఫ్ వాపోయారు. 

"భగవంతుడు నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. నేనొక 'మజ్నూ'ని (పిచ్చివాడ్ని). జీతం, ఇతర ప్రయోజనాలను పొందకపోవడమే కాదు, న్యాయపరమైన హక్కులను కూడా ఉపయోగించుకోలేకపోయాను" అని వ్యాఖ్యానించారు. తాను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్యదర్శి చక్కెర ఎగుమతులకు సంబంధించి ఓ నోట్ పంపాడని, అయితే తాను ఎగుమతి పరిమితిని నిర్ణయిస్తూ ఆ నోట్ ను తిరస్కరించానని షరీఫ్ వెల్లడించారు. జరిగింది అదేనని... కానీ తనపై మనీలాండరింగ్ అభియోగాలు మోపారని ఆరోపించారు. 

1997లో షాబాజ్ పంజాబ్ సీఎంగా ఉండగా, ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్ పాక్ ప్రధాని పదవిలో ఉన్నారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో... పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) 2020 నవంబరులో షాబాజ్ షరీఫ్ పైనా, ఆయన తనయులు హంజా, సులేమాన్ లపైనా అభియోగాలు మోపింది. హంజా షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండగా, సులేమాన్ బ్రిటన్ లో ఉన్నారు. 

2008 నుంచి 2018 మధ్య కాలంలో 14 బిలియన్ల పాకిస్థానీ రూపాయల మనీ లాండరింగ్ స్కామ్ జరిగిందని ఎఫ్ఐఏ ఆరోపిస్తోంది. షాబాజ్ షరీఫ్ కుటుంబానికి చెందినవిగా భావిస్తున్న 28 బినామీ ఖాతాలను గుర్తించినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News