IPL 2022: నేడే ఐపీఎల్ ఫైనల్!... ఫలితమేదైనా రికార్డే!
- గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య టైటిల్ పోరు
- నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
- మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్న 1.30 లక్షల మంది
- ముగింపు వేడుకలకు ఏఆర్ రెహ్మాన్, రణవీర్ సింగ్ హాజరు
దాదాపుగా నెలన్నర పాటు క్రికెట్ లవర్స్‌ను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15 సీజన్‌కు నేటితో తెర పడనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియనుంది. ఐపీఎల్‌లో ఈ ఏడాదే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్... మొత్తం 10 జట్లలోకి మెరుగైన ప్రదర్శన కనబరచి నేరుగా ఫైనల్ చేరుకుంది. అంచనాల మేరకే ఆడినా... ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా తమ సత్తా ఏమిటో చాటిన రాజస్థాన్ రాయల్స్ కూడా ఫైనల్ చేరింది. ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే... ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా కూడా అది రికార్డుగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ గెలిస్తే... అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే టైటిల్ ఎగురవేసుకుపోయిన జట్టుగా ఆ జట్టు రికార్డులకెక్కనుంది. అంతేకాకుండా తొలి సీజన్‌లో టైటిల్ నెగ్గిన రాజస్థాన్ జట్టుపైనే ఆ జట్టు విజయం సాధించినట్లవుతుంది. అలా కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధిస్తే... తొలి టైటిల్ నెగ్గిన 15 ఏళ్లకు ఆ జట్టుకు రెండో టైటిల్ దక్కినట్టవుతుంది. అంతేకాకుండా ఆ జట్టుకు టైటిల్ అందించిన షేర్ వార్న్ చనిపోయిన ఏడాదే అతడికి నివాళిగా రాజస్టాన్ ఈ టైటిల్‌ను అందించినట్టు అవుతుంది. వెరసి ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా కూడా అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.
మరోవైపు నెలన్నర పాటుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ తాజా సీజన్‌ను గ్రాండ్‌గా ముగించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా స్టేడియంలో ఫుల్ కెపాసిటీ మేరకు టికెట్లను విక్రయించింది. ఫలితంగా ఈ మ్యాచ్‌ను 1.30 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇక ఐపీఎల్ ముగింపు వేడుకలను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో పాటు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మరింత హుషారుగా మార్చనున్నారు.