RBI: దేశంలో దొంగ నోట్లు పెరిగాయ్: ఆర్బీఐ సంచలన నివేదిక

RBI Report Says Counterfeits for 2000 and 500s increased

  • 500 నోట్లలో 101.9 శాతం.. 2000 నోట్లలో 54.16 శాతం మేర దొంగ నోట్ల పెరుగుదల
  • నగదు చెలామణీ పెరిగిపోతోందన్న ఆర్బీఐ
  • మన దగ్గరున్న నోట్లలో 500 నోట్లదే హవా

2021–2022 ఆర్థిక సంవత్సరంలో అన్ని డినామినేషన్లకు సంబంధించిన దొంగ నోట్లు పెరిగిపోయాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నివేదికను విడుదల చేసింది. 500 నోట్లకు సంబంధించి 101.9 శాతం, 2000 నోట్లకు సంబంధించి 54.16 శాతం మేర దొంగ నోట్లు పెరిగాయని వెల్లడించింది. 

మరోవైపు నగదు చెలామణీ ఏటేటా పెరిగిపోతోందని ఆర్బీఐ పేర్కొంది. రూ.500 నోట్లకు సంబంధించి ప్రస్తుతం రూ.4,554.68 కోట్లు చెలామణీలో ఉన్నాయని, అదే అంతకుముందు ఏడాది మార్చిలో చెలామణీలో ఉన్న 500 నోట్ల విలువ కేవలం రూ.3,867.90 అని పేర్కొంది. 

నోట్లలో ఎక్కువగా 500దే హవా అని తెలిపింది. ఉన్న అన్ని నోట్లలో 500 నోట్లే 34.9 శాతం ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత 21.30 శాతంతో 10 నోట్లున్నాయని తెలిపింది. మరోవైపు 2000 నోట్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు నివేదిక వెల్లడించింది. 2020లో 274 కోట్ల నోట్లుండగా.. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆ సంఖ్య 214 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. 

దొంగనోట్లను ఇలా గుర్తుపట్టొచ్చు...

  • నోటును లైటు వెలుగులో చూస్తే ప్రత్యేకమైన ప్రాంతాల్లో 500 అని రాసి ఉంటుంది. అది లేకుంటే దొంగ నోటే. 
  • ఒరిజినల్ నోటు మీద దేవనాగరి లిపిలోనూ 500 అని రాసి ఉంటుంది.  
  • ఒరిజినల్ నోటు మీద మహాత్మా గాంధీ ఒరియెంటేషన్, రిలేటివ్ పొజిషన్ కూడా కుడివైపుకు ఉంటుంది. 
  • ఒరిజినల్ నోటైతే దాని మీద ఇండియా అని రాసి ఉంటుంది. 
  • నోటును వంచితే సెక్యూరిటీ హెడ్ కలర్ మారుతుంది. ఆకుపచ్చ నుంచి ముదురు వంగపండు రంగులో కనిపిస్తుంది. అది ఒరిజినల్ నోటు. 
  • ఇప్పుడున్న కరెన్సీ నోటుపై ఉన్న గవర్నర్ సంతకం, గ్యారంటీ క్లాజు, ప్రామిస్ క్లాజు, ఆర్బీఐ గుర్తులను నోటు కుడివైపునకు మార్చారు. 
  • నోటును అటుఇటు కదిలిస్తే 500 అని రాసి ఉన్న అంకె రంగు ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది. 
  • అశోక చక్రం నోటుకు కుడివైపున ఉంటుంది. 
  • స్వచ్ఛభారత్ లోగో, నినాదం ఉంటాయి.

కాగా, ఆర్బీఐ నివేదికతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టాయి. దీనికి కారణం నోట్ల రద్దేనని మండిపడ్డాయి. ‘‘నోట్ల రద్దు వల్ల కలిగిన దురదృష్టకరమైన విజయం ఏదైనా ఉందంటే అది ఆర్థికవ్యవస్థపై పెద్ద బాంబు వేయడమే’’ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 

నోట్ల రద్దు వల్ల దొంగ నోట్లు ఎలా అంతమవుతాయో మీరు చెప్పారు.. గుర్తుందా ప్రధాని నరేంద్ర మోదీ జీ? అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రయన్ విమర్శించారు. దొంగనోట్లు పెరిగాయంటూ ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని ఆయన కామెంట్ చేశారు. కాగా, 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News