Anitha: నటి రోజా గారు... అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వంగలపూడి అనిత
- మహిళలపై రోజా వ్యాఖ్యలు గర్హనీయమన్న అనిత
- అత్యాచారాలను తేలిగ్గా తీసుకుంటోందని ఆగ్రహం
- ఆమెను మంత్రి అని పిలవలేనని వెల్లడి
ఏపీ టూరిజం మంత్రి రోజాపై టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. ఒకట్రెండు అత్యాచార ఘటనలకే రాద్ధాంతం చేస్తున్నారంటూ రోజా తిరుపతిలో మాట్లాడడం దారుణమని అనిత పేర్కొన్నారు. ఓ మహిళా మంత్రి అయివుండి రోజా ఇంతటి బాధ్యతారాహిత్యంతో మాట్లాడడం తగదని హితవు పలికారు. రోజాను తాను మంత్రి అని పిలవనని, నటి రోజా గారనే అంటానని అనిత స్పష్టం చేశారు.
"రోజా మాటలు వింటుంటే ఆమె పరిణతి చెందిన రాజకీయ నాయకురాలిగా అనిపించడంలేదు. మంత్రి అని పిలిపించుకునే అర్హత కోల్పోయారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి చేపట్టినా గానీ ఆమెను చూస్తే పరిపూర్ణ నేత అనిపించడంలేదు. నాకే కాదు బుర్ర, బుద్ధి ఉన్నవారెవరికీ అలా అనిపించదు. అందుకే నటి రోజా అంటున్నాను.
కెమెరా ముందుకొచ్చి మాట్లాడ్డానికి ఇది సినిమాల్లో ఇచ్చే స్క్రిప్టు కాదమ్మా! ఇది రాజకీయం, ప్రజా ప్రాతినిధ్యం. మీరు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, ఓ మహిళ అయివుండి, ఓ ఆడపిల్లకు తల్లి అయివుండి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తేలిగ్గా మాట్లాడడం చూస్తుంటే మంత్రి పదవికి అర్హురాలేనా? అనిపిస్తోంది.
మంత్రి పదవి కోసం ఎంతమంది కాళ్లు పట్టుకుందో, ఎంతమందితో రికమండేషన్లు చేయించుకుందో కానీ, ఏదో రకంగా మంత్రి పదవిని తెచ్చుకోగలిగింది. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, బయటికి వచ్చి ఈ విధంగా మాట్లాడడాన్ని ఏ విధంగా స్వీకరించాలో అర్థం కావడంలేదు. ముఖ్యమంత్రే అలా మాట్లాడగా లేంది, హోంమంత్రే అలా మాట్లాడగా లేంది నేను మాట్లాడితే తప్పేముంది అనుకున్నట్టుంది" అంటూ రోజాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ అనిత ఈ వ్యాఖ్యలు చేశారు.