Amalapuram: అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొంది: విశాల్ గున్నీ
- కోనసీమ జిల్లా పేరు మార్పు
- ప్రజ్వరిల్లిన నిరసనలు
- మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు నిప్పు
- అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు
ఇటీవల కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో నిరసనజ్వాలలు భగ్గుమన్నాయి. మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల నివాసాలను ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారు. పలు వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. దాంతో అమలాపురంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితులపై ఏపీఎస్పీ కమాండెంట్ విశాల్ గున్నీ వివరణ ఇచ్చారు. అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొందని తెలిపారు. అమలాపురంలో ఏపీఎస్పీ సహా ప్రత్యేక బలగాలను మోహరించినట్టు వివరించారు. డీజీపీ సూచనలు, సలహాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... అమలాపురం అల్లర్లలో పాల్గొన్న మరో 18 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఇప్పటిదాకా మొత్తం 62 మందిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. అమలాపురంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్-30 ఆమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు.