Gujarat Titans: ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్... అరంగేట్రంలోనే అదుర్స్

Gujarat Titans won maiden IPL title

  • ముగిసిన ఐపీఎల్ టోర్నీ
  • ఫైనల్లో విజయభేరి మోగించిన గుజరాత్
  • రాజస్థాన్ పై 7 వికెట్ల తేడాతో విజయం
  • ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన గుజరాత్ సారథి పాండ్యా
  • రాణించిన గిల్, మిల్లర్

ఐపీఎల్ 15వ సీజన్ విజేతగా కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అవతరించింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. 131 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా టైటిల్ పోరులోనూ బాధ్యతాయుతంగా ఆడి తన జట్టును విజేతగా నిలిపాడు. ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) వెనుదిరిగినా.... కెప్టెన్ పాండ్యాకు తోడు ఓపెనర్ శుభ్ మాన్ గిల్ పట్టుదలగా ఆడడంతో రాజస్థాన్ బౌలర్లు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. 

పాండ్యా 34 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అయితే, గిల్ (45 నాటౌట్), మిల్లర్ (32 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. గిల్ ఓ భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు. దాంతో, రెండో పర్యాయం టైటిల్ సాధించాలన్న రాజస్థాన్ రాయల్స్ కలలు నెరవేరలేదు. 

కాగా, ఐపీఎల్ తాజా సీజన్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా, క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఓటమిపాలై టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ.7 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో, ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమిపాలైన లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. 

గతంలో భారత్ ను వన్డేల్లో వరల్డ్ కప్ విజేతగా నిలిపిన గ్యారీ కిర్ స్టెన్ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కు కూడా కోచ్ గా వ్యవహరించాడు. ఎక్కడా పెద్దగా హంగామా లేకుండానే, అత్యుత్తమ ఫలితాలు రాబట్టడం కిర్ స్టెన్ స్టయిల్. ఐపీఎల్ తాజా సీజన్ ద్వారా అది మరోసారి స్పష్టమైంది.

కాగా, ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ విసిరిన ఓ బంతి గంటకు 157.3 కిమీ వేగంతో దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ రికార్డు దీంతో తెరమరుగైంది.

  • Loading...

More Telugu News