IPL 2022: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు వీరే..!
- జోస్ బట్లర్ కు ఎన్నో అవార్డులు
- 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం
- అత్యధిక సిక్సర్లు, ఫోర్లు బాదిన ఆటగాడు కూడా తనే
- 27 వికెట్లు తీసిన చాహల్ కు పర్పుల్ క్యాప్
ఐపీఎల్ 15వ సీజన్ (2022) విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలవగా.. రాజస్థాన్ రన్నరప్ గా మిగిలిపోవాల్సి వచ్చింది. అయితే, కీలకమైన ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లను వరించడం విశేషం.
జోస్ బట్లర్ 863 పరుగులను పారించి ఈ సీజన్ లో రెండో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక రాజస్థాన్ జట్టు బౌలర్ యజువేంద్ర చాహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. బెంగళూరు జట్టు బౌలర్ వానిందు హసరంగ కంటే ముందున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా బట్లర్ కే దక్కింది. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ (ఈ సీజన్ కు వర్ధమాన ఆటగాడు) అవార్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడైన ఉమ్రాన్ మాలిక్ కు లభించింది.
అత్యధిక సిక్సర్లు కొట్టింది కూడా జోస్ బట్లరే. 45 సిక్స్ లు ఈ సీజన్ లో అతడి ఖాతాలో నమోదయ్యాయి. అత్యధిక ఫోర్లు (83) సాధించిన ఆటగాడి రికార్డు కూడా బట్లర్ నే వరించింది. ఇక 183.33 స్ట్రయిక్ రేటుతో సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ గా దినేష్ కార్తీక్ ఎంపికయ్యాడు. గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ కూడా జోస్ బట్లరే. ఫెయిర్ ప్లే అవార్డు రాజస్థాన్ జట్టును వరించింది. పవర్ ప్లే ఆఫ్ ద సీజన్ జోస్ బట్లర్. ఈ సీజన్ లో అత్యధిక వేగం 157.3 కిలోమీటర్లతో బంతిని సంధించిన బౌలర్ గా (గుజరాత్ ) లాకీ ఫెర్గూసన్ నిలిచాడు. క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డును లక్నో జట్టు ఆటగాడు ఎవిన్ లెవిస్ సొంతం చేసుకున్నాడు.