HDFC bank: అకస్మాత్తుగా కోటీశ్వరులైన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులు.. కొద్ది సేపే..!
- రూ.13 కోట్ల వరకు ఖాతాల్లో జమ
- చెన్నై టీ నగర్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు శాఖలో తప్పిదం
- సాఫ్ట్ వేర్ ప్యాచ్ అమలు చేసే క్రమంలో సాంకేతిక లోపం
- సాయంత్రానికి సరిచేసిన బ్యాంకు
ఉన్నట్టుండి బ్యాంకు ఖాతాలో రూ.లక్షలు, కోట్లు జమ అయితే ఏం చేస్తారు.? ఎగిరి గంతేయడం ఖాయం. చెన్నైలో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులూ ఇదే పనిచేశారు. కానీ, వారి సంతోషం ఎంతో సమయం నిలవలేదు. ఎందుకంటే ఇదంతా సాంకేతిక లోపం కారణంగా చోటు చేసుకున్నట్టు వారికి తర్వాత తెలిసింది.
ఆదివారం చెన్నైలోని టీ నగర్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు శాఖ పరిధిలో 100కు పైగా ఖాతాల్లో గరిష్ఠంగా రూ.13 కోట్ల చొప్పున జమ అయింది. అయితే, ఎంత మొత్తం అన్నది హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు నిర్ధారించలేదు. వేల రూపాయల నుంచి రూ.13 కోట్ల వరకు ఖాతాల్లో జమ అయినట్టు బ్యాంకు సైతం తెలిపింది.. టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఇలా జరిగినట్టు వివరణ ఇచ్చింది.
ఆదివారం సెలవుదినం కావడంతో వేకువ జాము సమయంలో సాఫ్ట్ వేర్ ప్యాచ్ ను అమలు చేస్తున్న తరుణంలో ఇలా తప్పిదం చోటు చేసుకున్నట్టు బ్యాంకు తెలిపింది. అయితే ఇలా జమ అయిన తర్వాత ఎవరైనా ఉపసంహరించుకున్నారా? అన్న విషయమై బ్యాంకు దర్యాప్తు నిర్వహిస్తోంది. ఖాతాలన్నింటినీ తనిఖీ చేసి, అదనపు జమలను బ్యాంకు సాయంత్రానికి వెనక్కి తీసేసుకుంది.