Javed Miandad: ఇప్పటి ఆటగాళ్లు గవాస్కర్ వీడియోలు చూడాలంటున్న పాక్ క్రికెట్ దిగ్గజం
- గవాస్కర్ తరంలో ఆడిన జావెద్ మియాందాద్
- గవాస్కర్ టెక్నిక్ అమోఘమని కితాబు
- గవాస్కర్ డిఫెన్స్ ను ఇప్పటి ఆటగాళ్లు గమనించాలని సూచన
పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్ జావెద్ మియాందాద్ కు భారత ఆటగాళ్లతో వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అది మైదానం వరకే. భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తరంలో ఆడిన మియాందాద్ ఇప్పటి తరానికి విలువైన సూచన చేశాడు.
ఈ కాలపు ఆటగాళ్లు సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ వీడియోలను తప్పనిసరిగా చూడాలని పేర్కొన్నాడు. మైఖేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, మాల్కమ్ మార్షల్, ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్ హ్యాడ్లీ, డెన్నిస్ లిల్లీ వంటి మహోన్నత ఫాస్ట్ బౌలర్లను గవాస్కర్ ఎంత సాధికారికంగా ఎదుర్కొన్నాడో చూడాలని తెలిపాడు.
ఎంతో పొట్టివాడైన గవాస్కర్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల పిచ్ లపై మెరుగైన ఆటతీరు కనబర్చడం అద్భుతమని మియాందాద్ కొనియాడాడు. తన కెరీర్ ఆసాంతం గవాస్కర్ కనబర్చిన నిలకడ గమనించాల్సిన అంశమని వివరించాడు. గట్టిగా 5.5 అడుగులు ఉండే గవాస్కర్ తిరుగులేని డిఫెన్స్ తో తన కంటే ఎంతో పొడగరులైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే తీరు ఇప్పటి తరం ఆటగాళ్లకు పాఠంగా నిలుస్తుందని మియాందాద్ అభిప్రాయపడ్డాడు.
గవాస్కర్ ఆడుతుంటే తాను కూడా ఆస్వాదించేవాడ్నని తెలిపాడు. "భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ల సందర్భంగా గవాస్కర్ బ్యాటింగ్ చేస్తుండగా, నేను వికెట్లకు దగ్గరగా ఫీల్డింగ్ చేసేవాడ్ని. గవాస్కర్ ను కవ్వించేందుకు అనేక ప్రయత్నాలు చేసేవాడిని. కానీ గవాస్కర్ చెక్కుచెదరని ఏకాగ్రతతో బ్యాటింగ్ చేసేవాడు. కొన్నిసార్లు, నా మాటలతో చికాకుపడి అవుటయ్యేవాడు. అలాంటి సమయాల్లో నన్ను తిట్టుకుంటూ మైదానం వీడేవాడు. అప్పుడు కూడా నేను ఆస్వాదించేవాడ్ని" అని మియాందాద్ వివరించాడు. అంతేకాదు, భారత క్రికెట్ కు సునీల్ గవాస్కర్, ఆయన బావమరిది గుండప్ప విశ్వనాథ్ వంటి క్రికెటర్లు లభించడం గొప్ప అదృష్టం అని పేర్కొన్నాడు.