Bandi Sanjay: గజ్వేల్, సిద్ధిపేట, పాతబస్తీల్లో కరెంటు బిల్లులు వసూలు చేయట్లేదు: బండి సంజయ్
- మోటార్లకు మీటర్లపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న సంజయ్
- మీటర్లతో ఫాం హౌజ్‌లలోని అక్రమాలు బయటపడతాయని వ్యాఖ్య
- భద్రాద్రి ప్రాజెక్టు ఏర్పాటులో పెద్ద కుంభకోణం ఉందన్న సంజయ్
తెలంగాణలో విద్యుత్ బిల్లుల వసూలుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక ఆరోపణలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ముక్కు పిండి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్న కేసీఆర్ సర్కారు.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్, సొంతూరు సిద్ధిపేటతో పాటు టీఆర్ఎస్తో దోస్తానా సాగిస్తున్న మజ్లిస్ పార్టీకి పట్టున్న పాతబస్తీల్లో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. సాగు మెటార్లకు మీటర్లు పెడితే బడా బాబుల ఫాం హౌజ్‌లలో విద్యుత్ అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు ఏర్పాటు వెనుక పెద్ద కుంభకోణమే దాగుందని ఆయన ఆరోపించారు. బినామీలతో పెట్టుబడులు పెట్టించి కమీషన్లు దండుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మార్కెట్లో రూ.3కు దొరికే విద్యుత్‌ను టీఆర్ఎస్ సర్కారు రూ.6 పెట్టి కొంటోందని ఆయన విమర్శించారు.