Gadikota Srikanth Reddy: మహానాడులో బూతులు మాట్లాడిస్తూ చంద్రబాబు శునకానందం పొందారు: గడికోట శ్రీకాంత్ రెడ్డి
- టీడీపీ మహానాడుపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్
- టీడీపీ నేతలు సంస్కారహీనంగా మాట్లాడారని విమర్శలు
- చంద్రబాబుది సైకో బుద్ధి అని వ్యాఖ్యలు
టీడీపీ మహానాడు తీరుతెన్నులపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. మహానాడులో చంద్రబాబు తన నేతలతో సంస్కారహీనంగా బూతులు మాట్లాడిస్తూ శునకానందం పొందారని విమర్శించారు. సీఎం జగన్ జనరంజకంగా పరిపాలిస్తుండడంతో ఓర్వలేక మహానాడు పేరిట టీడీపీ నేతలు ఒక బూతునాడు కార్యక్రమం జరిపారని అన్నారు.
"అధికారంలో ఉన్నప్పుడు మేం తలుచుకుని ఉంటే మీరు బయటికి వచ్చేవాళ్లా? అని చంద్రబాబు అంటున్నాడు, ఇప్పుడు మేం అదే మాట అంటే మీ పరిస్థితి ఏంటో చూసుకోండి" అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయాలన్నదే చంద్రబాబు ప్రయత్నమని, అందుకే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఏపీ మరో శ్రీలంక అవుతుందని, ప్రజలు తిరగబడతారని పగటికలలు కంటున్నారని, కానీ చంద్రబాబు అనుకుంటున్నవేవీ జరగవని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు లేస్తే హైదరాబాద్ ను తానే కట్టానని చెబుతుంటాడని, కానీ అప్పట్లో ఆయన బావమరిది బాలకృష్ణ సీఎంగా ఉన్నా గానీ ఐటీ రంగం అభివృద్ధి చెంది ఉండేదని వ్యాఖ్యానించారు.
అమరావతి రాజధాని పేరుతో ఐదేళ్ల పాటు ప్రజలను భ్రమల్లో ముంచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించాడని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైజాగ్ పరిపాలనా రాజధానిగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే, చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయడం ద్వారా అడ్డుకుంటున్నారని అన్నారు. దీన్ని సైకో బుద్ధి అనక ఇంకేమనాలి? అంటూ ప్రశ్నించారు.