IPL 2022: క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు రూ.1.25 కోట్ల నజరానా ప్రకటించిన జై షా
- ఆదివారంతో ముగిసిన ఐపీఎల్ తాజా సీజన్
- మొత్తం 6 స్టేడియంలలో జరిగిన ఐపీఎల్
- క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌ను తెర వెనుక హీరోలుగా అభివర్ణించిన జై షా
ఆదివారంతో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ మొత్తంగా 6 స్టేడియంలలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలలో పనిచేస్తున్న క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. మొత్తం ఆరు స్టేడియంలలో పనిచేస్తున్న సిబ్బందికి రూ.1.25 కోట్ల నజరానాను బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం ప్రకటించారు.
ఐపీఎల్ మ్యాచ్‌లకు అద్భుతమైన పిచ్‌లను అందించారన్న జై షా... క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌ను తెర వెనుక హీరోలుగా అభివర్ణించారు. సిబ్బంది అంకిత భావంతో రూపొందించిన పిచ్‌లలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిరాటంకంగా సాగాయని, ప్రతి మ్యాచ్‌కు అద్భుతమైన పిచ్‌లు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా సిబ్బందిని ప్రోత్సహించేందుకే ఈ నజరానాను ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.