Satyendar Kumar Jain: హవాలా కేసులో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్
- ఆప్ ప్రారంభం నుంచి పార్టీలో కొనసాగుతున్న సత్యేంద్ర జైన్
- ఢిల్లీలో షాకూర్ బస్తీ ఎమ్మెల్యేగా గెలుపు
- కేజ్రీవాల్ కేబినెట్లో కీలక శాఖల మంత్రి
- కోల్‌కతాకు చెందిన కంపెనీతో హవాలా లావాదేవీల ఆరోపణలు
హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఆప్ కీలక నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.
కోల్ కతాకు చెందిన ఓ కంపెనీతో చాలా కాలంగా గుట్టుగా హవాలా లావాదేవీలు సాగిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ... సదరు సమాచారం నిజమేనని నిర్ధారించుకుంది. ఈ వ్యవహారంపై సత్యేంద్ర జైన్‌కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన మీదటే ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆయనపై హవాలా ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆప్ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని షాకూర్ బస్తీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్లోని ఏడుగురు మంత్రుల్లో ఒకరిగా సత్యేంద్ర జైన్ కొనసాగుతున్నారు. ఆరోగ్య శాఖతో పాటు పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, విద్యుత్, హోం శాఖల మంత్రిగా సత్యేంద్ర జైన్ కొనసాగుతున్నారు.