Chandrababu: కుప్పంలో అక్రమ మైనింగ్‌పై ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ
- గుడిపల్లి మండలం గుతర్లపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న బాబు
- ఎన్జీటీలో విచారణ జరుగుతున్నా అక్రమ మైనింగ్ కొనసాగుతోందని వ్యాఖ్య
- వైసీపీ నేతలతో అధికారులు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణ
- సీజ్ చేసిన గ్రానైట్ లారీల ఫొటోలను లేఖకు జత చేసిన చంద్రబాబు
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అక్రమంగా గ్రానైట్ మైనింగ్ జరుగుతోందని, దానిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు ఓ లేఖ రాశారు. సదరు లేఖకు ఇటీవలే అధికారులు సీజ్ చేసిన గ్రానైట్ లారీల ఫొటోలను కూడా జత చేశారు.
కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం గుతర్లపల్లిలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోందని సదరు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఎన్జీటీలో విచారణ జరుగుతోందని, అయినా కూడా అక్కడ మైనింగ్ ఆగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలతో కుమ్మక్కై స్థానిక అధికారులు అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని కూడా చంద్రబాబు ఆరోపించారు. అక్రమ మైనింగ్ వల్ల కుప్పం పరిధిలో పర్యావరణం దెబ్బ తింటోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా దాడులు పెంచి అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన సీఎస్‌ను కోరారు.