Vladimir Putin: వేగంగా కంటిచూపు కోల్పోతున్న పుతిన్... మరో మూడేళ్లకు మించి బతకడంటూ సంచలన కథనం

Sensational story on Putin health

  • పుతిన్ ఆరోగ్యంపై పాశ్చాత్య మీడియాలో కథనాలు
  • రష్యన్ గూఢచారిని ఉటంకిస్తూ 'ఇండిపెండెంట్' లో కథనం
  • కేన్సర్ మరింత ముదిరిపోయిందని వెల్లడి  
  • ప్రచారాన్ని ఖండించిన రష్యా విదేశాంగ మంత్రి 

ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల కాలంలో పుతిన్ ఆరోగ్యంపైనా కథనాలు వస్తున్నాయి. వాటన్నింటిని మించిపోయేలా 'ది ఇండిపెండెంట్' పత్రికలో సంచలన కథనం వచ్చింది. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్ బీ) అధికారి ఒకరిని ఉటంకిస్తూ ఈ కథనం వెలువరించారు. 

పుతిన్ వేగంగా కంటిచూపు కోల్పోతున్నారని, ఆయన మరో మూడేళ్లకు మించి బతకరని తెలిపారు. పుతిన్ కు కేన్సర్ మరింత ముదిరిపోయిందని పేర్కొన్నారు. ఈ విషయాలను సదరు ఎఫ్ఎస్ బీ అధికారి బ్రిటన్ లో ఉంటున్న మాజీ రష్యన్ గూఢచారి బోరిస్ కార్పిచ్ కోవ్ కు తెలియజేశాడని 'ది ఇండిపెండెంట్డె' వెల్లడించింది. 

అటు, ఆస్ట్రేలియా మీడియాలోనూ పుతిన్ కంటిచూపుపై కథనాలు వచ్చాయి. పుతిన్ టీవీలో కనిపించిన సమయంలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసివున్న కాగితాలపై ఉన్న సందేశాలను చదివి వినిపిస్తుంటాడని, ఒక్కో పేజీలో కేవలం రెండే లైన్లు ఉంటాయని తెలిపారు. పుతిన్ కంటిచూపు క్షీణిస్తోందనడానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు. 

మరికొన్ని మీడియా సంస్థలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాయి. పుతిన్ అవయవాలు నియంత్రణ రహితంగా వణుకుతున్నాయని పేర్కొన్నాయి. 

అయితే, పుతిన్ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఖండించారు. పుతిన్ అనారోగ్యం బారినపడ్డారన్న వార్తల్లో నిజంలేదని అన్నారు. ఆయన చికిత్స పొందుతున్న సూచనలేవీ లేవని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News