Rajasthan: రూ. 35 కోసం రైల్వేతో ఐదేళ్లు పోరాడి విజయం సాధించిన వ్యక్తి.. 2.98 లక్షల మందికి కూడా లబ్ధి!

Mans 5 year fight to get Rs 35 refund in Rajasthan

  • జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్ బుక్ చేసుకుని ఆ తర్వాత కేన్సిల్ చేయించుకున్న వ్యక్తి
  • జీఎస్టీని కలుపుకుని రూ. 100 మినహాయిస్తూ రిఫండ్ చేసిన రైల్వే
  • ఆ రూ.35 వెనక్కి ఇవ్వాల్సిందేనని పోరాటం
  • రూ. 33 జమ చేయడంతో ఆ రూ. 2 కోసం మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించిన ఇంజినీర్

ఆ.. 35 రూపాయలే కదా, ఏముందిలే.. అని వదిలేస్తారు కొందరు. ఎన్ని పోలేదు, ఈ రూ. 35 ఓ లెక్కా? అని ఉదాసీనంగా ఉండిపోతారు మరికొందరు. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా కాదు. రైల్వేతో ఐదేళ్లు పోరాడి తనకు రావాల్సిన రూ. 35 సాధించుకున్నారు. అంతేకాదు, ఆయన పోరాటంతో 2.98 లక్షల మందికి లబ్ధి చేకూరడం గమనార్హం. 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్‌స్వామి అనే ఇంజినీర్ 2 జులై 2017న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా ఏప్రిల్‌‌లో టికెట్ బుక్ చేసుకుని టికెట్ ధర రూ. 765 చెల్లించారు. ఆ తర్వాత ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో రూ. 100 మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ రిఫండ్ చేసింది.

నిజానికి కేన్సిలేషన్ రుసుము రూ. 65 మాత్రమే మినహాయించుకోవాల్సి ఉండగా అదనంగా రూ. 35 జీఎస్టీ కింద వసూలు చేయడంపై స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జీఎస్టీ అమల్లోకి రాకముందే టికెట్ బుక్ చేసుకున్నానని, అలాంటప్పుడు తన నుంచి జీఎస్టీ ఎలా వసూలు చేస్తారని రైల్వేపై పోరాటానికి దిగారు. ఇందులో భాగంగా రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద 50 అర్జీలు పెట్టారు. ఫలితంగా దిగొచ్చిన రైల్వే.. జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ. 35ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. 

రూ. 35 చెల్లించాల్సిన రైల్వే 1 మే 2019న ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 33 మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించారు. ఆ రెండు రూపాయలను కూడా రైల్వే ఆయన ఖాతాలో జమచేసింది. అంతేకాదు, ఆయన పోరాటంతో మరో 2.98 లక్షల మంది కూడా లబ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్లు బుక్ చేసుకుని కేన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం మొత్తంగా రూ. 2.43 కోట్లను రైల్వే రీఫండ్ చేయనుంది.

  • Loading...

More Telugu News