Mankirt Aulakh: తనకు భద్రత కల్పించాలంటూ తెరపైకి వచ్చిన పంజాబీ గాయకుడు మన్ కీర్త్ ఔలాక్
- పంజాబ్ లో సింగర్ మూసేవాలా హత్య
- తీవ్ర భయాందోళనలో గాయకుడు మన్ కీర్త్ ఔలాక్
- ఏప్రిల్ లో బెదిరింపులు వచ్చాయని వెల్లడి
పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా కాల్చివేత ఘటన పంజాబ్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధూ మూసేవాలాకు భద్రత తొలగించిన మరుసటి రోజే ఈ హత్య జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో, మరో పంజాబీ గాయకుడు మన్ కీర్త్ ఔలాక్ తనకు భద్రత కావాలంటూ తెరపైకి వచ్చాడు. ఔలాక్ ను చంపేస్తామంటూ ఏప్రిల్ నెలలో బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో, తనకు పంజాబ్ పోలీసులు మరింత మెరుగైన భద్రత కవచం ఏర్పాటు చేయాలని మన్ కీర్త్ ఔలాక్ కోరుతున్నాడు.
పంజాబ్ లో ప్రధానంగా లారెన్స్ బిష్ణోయ్, దేవిందర్ బంభియా ముఠాల మధ్య గ్యాంగ్ వార్ లో మూసేవాలా వంటి వారు బలవుతున్నట్టు భావిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ జైలుకు వెళ్లడంతో, గోల్డీ బ్రార్ ఆ ముఠా బాధ్యతలు చూస్తున్నాడు. మూసేవాలా హత్యకు తానే బాధ్యుడ్ని అంటూ గోల్డీ బ్రార్ ఫేస్ బుక్ లో ప్రకటించుకోవడం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ వికీ మిద్దుఖేరా మృతికి ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను చంపినట్టు గోల్డీ బ్రార్ పేర్కొన్నాడు.