Tirumala: వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక!... రేపటి నుంచి తిరుమలలో ప్లాస్టిక్‌పై పూర్తిగా నిషేధం
- తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం
- రేపటి నుంచే నిషేధం అమలులోకి
- అలిపిరి వద్ద మరింత మేర తనిఖీలు
- వ్యాపారులు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందేనన్న టీటీడీ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ మంగళవారం ఓ ముఖ్య గమనికను విడుదల చేసింది. రేపటి నుంచి తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్లు కూడా టీటీడీ వెల్లడించింది.
తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించిన టీటీడీ... కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా పెట్టనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.