Konaseema District: కోనసీమలో కొనసాగుతున్న అరెస్టులు... 4 మండలాల్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ
- మంగళవారం 9 మంది అరెస్ట్
- 71కి చేరుకున్న అరెస్ట్‌ల సంఖ్య
- సఖినేటిపల్లి, మల్కిపురం, ఆత్రేయపురం, ఐ పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ
- 12 మండలాల్లో మరో 24 గంటల పాటు సేవల నిలిపివేత
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం అమలాపురంలో చెలరేగిన అల్లర్ల కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంగళవారం మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 71కి చేరుకుంది. మరింత మంది అనుమానితులను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు కదులుతున్నారు.
ఇదిలా ఉంటే అల్లర్ల నేపథ్యంలో జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారానే నిందితులు అల్లర్లకు పాల్పడ్డారని తేలడంతో అల్లర్లు చెలరేగిన నాడే పోలీసులు ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. తాజాగా మంగళవారం సఖినేటిపల్లి, మల్కిపురం, ఆత్రేయపురం, ఐ పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పోలీసులు పునరుద్ధరించారు. జిల్లాలోని మరో 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవల రద్దును మరో 24 గంటల పాటు పొడిగించారు.