LPG cylinders: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర!
- వాణిజ్య సిలిండర్ ధరపై రూ.135 తగ్గింపు
- ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ తాజా ధర రూ.2,219
- చాలా విరామం తర్వాత తగ్గిన ధరలు
- డొమెస్టిక్ ఎల్పీజీపై ప్రస్తుతానికి ఉపశమనం లేనట్టే
చాలా కాలం తర్వాత వంట గ్యాస్ ధరలు తగ్గాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై రూ.135ను తగ్గిస్తున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. గడిచిన ఏడాది కాలంలో ధరలు తగ్గడం ఇదే. దీంతో తగ్గింపు తర్వాత వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీ మార్కెట్లో రూ.2,219గా ఉంది. చెన్నైలో రూ.2,373గా ఉంది. ముంబైలో రూ.2,171.50, కోల్ కతాలో రూ.2,322గా ఉంది.
నిజానికి మే 1న వాణిజ్య సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.102.50 పెంచాయి. ఇప్పుడు పెంచిన మేర తగ్గించినట్టు అయింది. అంతకుముందు నెల ఏప్రిల్ 1న ఇదే వాణిజ్య సిలిండర్ ధర రూ.250 పెరిగింది. మార్చి 1న రూ.105 పెంచారు.
ఇళ్లల్లో వినియోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం ఆయిల్ కంపెనీలు తగ్గించలేదు. నిజానికి వంటింటి గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ తో సమానంగా పెంచడం లేదు. దీంతో తగ్గింపు ఉపశమనాన్ని వినియోగదారులకు కల్పించినట్టు లేదు. రానున్న రోజుల్లో ధరలు తగ్గుతాయేమో చూడాలి.