Mallu Bhatti Vikramarka: చింతన్ శిబిర్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాకపోవడానికి కారణం ఇదే: మల్లు భట్టివిక్రమార్క
- హైదరాబాద్ లో ప్రారంభమైన చింతన్ శిబిర్ కార్యక్రమం
- ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్న కాంగ్రెస్ నేతలు
- మొత్తం 6 అంశాలపై చర్చించనున్నామన్న మల్లు భట్టి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాజకీయ పరిస్థితులను కూడా పొందుపరిచి పార్టీ అధిష్ఠానానికి నివేదిక ఇస్తామని చెప్పారు. మొత్తం 6 అంశాలపై చర్చించనున్నామని, వీటిల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలు ఉంటాయని తెలిపారు.
ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. చింతన్ శిబిర్ లో తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రోడ్ మ్యాప్ లా పని చేస్తాయని తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడంపై స్పందిస్తూ... ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్లే ఆయన హాజరు కాలేదని చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని అన్నారు.