Akshay Kumar: బాధాకరం.. ఎంతో మంది గాయకులను కోల్పోతున్నాం..: అక్షయ్ కుమార్
- తన కెరీర్ లో కేకే కూడా భాగమన్న అక్షయ్
- తన సినిమాల్లో చాలా వాటికి స్వరాన్ని అందించినట్టు ప్రకటన
- కేకే మరణం షాకింగ్ కు గురిచేసిందంటూ ఆవేదన
ప్రముఖ గాయకుడు కేకే మరణం పట్ల బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ కతాలోని నజ్రుల్ మంచ్ వద్ద మంగళవారం రాత్రి ప్రదర్శన ఇచ్చిన అనంతరం కేకే అస్వస్థతకు గురి కాగా, ఆయన్ను సీఎంఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు. కాని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించడం తెలిసిందే. దీన్ని అసహజ మరణం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్ధూ మూసేవాలా హత్యోదంతం జరిగిన రెండు రోజులకే మరో ప్రముఖ గాయకుడి అకాల మరణం యావత్ సినిమా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. దీనిపై నటుడు అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ‘‘నా కెరీర్ లో కేకే కూడా ఒక భాగం. నాకు సంబంధించి ఎన్నో పాటలకు స్వరాన్ని అందించాడు. అతడు ఆలపించిన తూ బోలా జైసే పాట వల్లే ఎయిర్ లిఫ్ట్ మూవీ క్లైమాక్స్ చక్కగా వచ్చింది. గత రాత్రి జరిగిన ఘటన నిజంగా షాకింగ్ గా ఉంది’’ అని పేర్కొన్నాడు. అక్షయ్ కుమార్ కెరీర్ లో కేకే ఎన్నో పాటలను ఆలపించడం గమనార్హం.
ఈ ఏడాది గాయకులు లతా మంగేష్కర్, సిద్ధూ మూసేవాలా, కేకే దూరం కావడం పట్ల అక్షయ్ స్పందిస్తూ.. ‘‘ఇది ఎంతో బాధాకరం. ఎంతోమంది గాయకులను కోల్పోతున్నాం. అది కూడా యుక్త వయసులోనే’’ అని అన్నాడు. కేకే పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నత్. ఆయన 1968లో ఢిల్లీలో జన్మించారు. కేకే మరణం పట్ల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా వరకు ఎంతో మంది సంతాపం వ్యక్తం చేశారు.