Supreme Court: రిషికొండలో కొత్త నిర్మాణాలకు సుప్రీంకోర్టు నో.. పాత చోట నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్!
- గతంలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు జరుపుకోవాలన్న సుప్రీం
- పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీనంటూ వ్యాఖ్య
- కొత్త నిర్మాణాలతో పర్యవారణానికి ప్రమాదమేనన్న సుప్రీంకోర్టు
విశాఖ పరిధిలోని రిషికొండలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రిసార్ట్‌కు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రిషికొండ రిసార్ట్ విస్తరణకు అనుమతి లేదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు... పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. రిషికొండలో కొత్త నిర్మాణాలు కూడదని చెప్పిన సుప్రీంకోర్టు... పాత నిర్మాణాలకు అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ గవాయ్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది.
రిషికొండ పరిధిలో ఉన్న రిసార్ట్‌ను పూర్తిగా కూల్చేసిన ఏపీ ప్రభుత్వం అక్కడే దానిని మరింతగా విస్తరిస్తూ కొత్త రిసార్ట్‌ను కడుతున్న సంగతి తెలిసిందే. ఈ పనుల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించగా... పనులు నిలిపివేయాలంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎన్జీటీ పరిధిపై విస్మయం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఎన్జీటీ జారీ చేసిన తీర్పు కాపీ ఉందా? అంటూ ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అందుకోసం సమయం కావాలని ఏపీ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
బుధవారం నాటి విచారణలో భాగంగా రిషికొండలో కొత్త రిసార్ట్ వల్ల పర్యావరణానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో గతంలో రిసార్ట్ ఉన్న ప్రాంతానికే నిర్మాణాలను పరిమితం చేయాలని చెప్పిన కోర్టు... కొత్తగా తవ్వకాలు జరిపిన చోట ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చెప్పింది. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. రిషికొండ పరిధిలో ఈ బాధ్యత అందరిదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.