Congress: మీడియాకు ఎక్కి రచ్చ చేయొద్దు!... టీ కాంగ్రెస్ నేతలకు మాణిక్కం ఠాగూర్ వార్నింగ్!
- గాంధీ భవన్లో చింతన్ శిబిర్
- కీలక అంశాలపై వాడీవేడీగా చర్చ
- విభేదాలను నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోమన్న ఠాగూర్
- ఏదైనా ఉంటే నేరుగా తనతోనే మాట్లాడమని సూచన
- అంతా సెట్ అయ్యింది...ఇంకో ఇద్దరు, ముగ్గురే ఉన్నారన్న ఠాగూర్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) నేతలకు పార్టీ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ మరోమారు ఫుల్లుగా క్లాస్ పీకారు. గతంలో సమయ పాలన పాటించాలని వార్నింగ్ ఇచ్చిన ఠాగూర్..తాజాగా పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని హితబోధ చేశారు. పార్టీలో విభేదాలపై మీడియాకు ఎక్కి రచ్చ చేయొద్దంటూ ఆయన నేతలకు ఒకింత స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. బుధవారం గాంధీ భవన్లో జరిగిన పార్టీ చింతన్ శిబిర్ తొలి రోజు సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.
ఈ భేటీలో పలు కీలక అంశాలపై వాడీవేడిగా చర్చ సాగగా... ఏదైనా సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య చర్చించుకుని పరిష్కరించుకోవాలని మాణిక్కం ఠాగూర్ పార్టీ నేతలకు సూచించారు. అంతే తప్పించి మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేయరాదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. చర్చించుకున్నా సమస్య పరిష్కారం కాకపోతేనే... సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ తరహా వ్యవహారాలకు సంబంధించి పార్టీలో అంతా సెట్ అయ్యిందన్న ఠాగూర్... ఇంకా ఇద్దరు, ముగ్గురే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.