Sourav Ganguly: ఎడ్యుకేషనల్ యాప్ ప్రారంభించా: సౌరవ్ గంగూలీ
- కొత్త ప్రయాణమంటూ గంగూలీ ట్వీట్
- రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం
- వరల్డ్ వైడ్ ఎడ్యుకేషనల్ యాప్ ప్రారంభించానన్న గంగూలీ
- బీసీసీఐ పదవికి గంగూలీ రాజీనామా చేయలేదన్న జై షా
- గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై ముగిసిన ప్రచారం
కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానంటూ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ బుధవారం మధ్యాహ్నం చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఓ ఎడ్యుకేషనల్ యాప్‌ను ప్రారంభించానని, ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని బుధవారం రాత్రి ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు కోల్‌కతాలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా గంగూలీ ఈ ప్రకటన చేశారు.
బీసీసీఐ కార్యదర్శి జై షాతో మిత్రత్వం, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇప్పటికే రెండు సార్లు భేటీ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్న గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని, బీజేపీలో ఆయన చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే తాను ఓ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషనల్ యాప్‌ను ప్రారంభించానంటూ గంగూలీ ప్రకటించడంతో ఆ ప్రచారానికి తెర పడినట్టేనని చెప్పాలి. ఇదిలా ఉంటే... బీసీసీఐ చీఫ్ పదవికి గంగూలీ రాజీనామా చేయలేదని బుధవారం సాయంత్రం జై షా కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.