Lord Macaulay: నాడు రూ.100 ఇచ్చి ఊటీలో ప్రజాగ్రహం నుంచి తప్పించుకున్న ఇండియన్ పీనల్ కోడ్ రూపకర్త
- భారత న్యాయ వ్యవస్థకు గుండెకాయలా ఐపీసీ
- ఇండియన్ పీనల్ కోడ్ ను రచించిన లార్డ్ మెకాలే
- 1834లో ఇండియా గవర్నర్ జనరల్ గా బెంటింక్
- ఊటీలో ప్రమాణస్వీకారం
- తన బోయీ కారణంగా చిక్కుల్లో పడిన మెకాలే
భారత్ వంటి విశాల దేశంలో ప్రజాస్వామ్యం విలసిల్లుతోందంటే అందుకు కారణం రాజ్యాంగం, చట్టాలే. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థకు ప్రాణాధారంగా నిలిచే ఇండియన్ పీనల్ కోడ్ గురించి చెప్పుకోవాలి. ఐపీసీ గా అందరికీ సుపరిచితమైన ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పటిదికాదు. బ్రిటీష్ వారి హయాంలో రూపుదిద్దుకున్న ఇండియన్ పీనల్ కోడ్ ను లార్డ్ థామస్ బాబింగ్ట్ మెకాలే రచించారు.
ఇక అసలు విషయానికొస్తే... ఊటీలో నాడు మెకాలే దొరకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన పల్లకీ మోసే బోయీల్లో ఒకరి కారణంగా ఆయన రూ.100 లంచం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన 1834లో జరిగింది. ఇక్కడి నీలగిరి డాక్యుమెంటేషన్ సెంటర్ (ఎన్డీసీ)లో ఆనాటి ఘటన రికార్డయింది. ఫ్రాన్సిస్ లాసెల్లిస్ రాసిన "రెమెనిసెన్స్ ఆఫ్ యాన్ ఇండియన్ జడ్జ్" అనే పుస్తకంలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ లాసెల్లిస్ భారత్ లో అనేక ప్రాంతాల్లో జడ్జిగా పనిచేశారు. ఆయన ఊటీ న్యాయస్థానంలోనూ విధులు నిర్వర్తించారు. ఆయన తన పుస్తకంలో పేర్కొన్న అంశాలను ఎన్డీసీ పదిలపరిచింది.
1834లో లార్డ్ బెంటింక్ భారత మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా నియమితులయ్యారు. అప్పటికి ఆయన కోల్ కతా గవర్నర్ గా ఉన్నారు. కాగా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి ప్రమాణస్వీకారం ఊటీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం మద్రాస్ లో ఉన్న లార్డ్ మెకాలే కూడా ఓ పల్లకీలో బయల్దేరారు. ఏడు రోజులు ప్రయాణించి ఆయన ఊటీ చేరుకున్నారు.
ఊటీ వచ్చిన మెకాలే దొర అక్కడే మూడు నెలల పాటు ఉన్నారు. అయితే, ఆయన పల్లకీ మోసిన బోయీల్లో ఒకరు స్థానిక మహిళతో ప్రేమాయణం నెరిపాడు. మెకాలే దొర మద్రాసు తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో స్థానిక ప్రజలు సెయింట్ స్టీఫెన్స్ చర్చి వద్ద వారిని అడ్డగించారు. సదరు బోయీని బయటికి లాగారు. మహిళను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించారు.
ఆ సమయంలో ఫ్రాన్సిస్ లాసిల్లస్ ఊటీలో జడ్జి. ఆనాడు తన అనుభవంలోకి వచ్చిన అంశాలను ఆ న్యాయమూర్తి తన పుస్తకంలో వివరించారు.
"1834 ఏప్రిల్ మాసంలో ఓ ఆదివారం నాడు ఇదంతా జరిగింది. మద్రాసుకు వెళ్లే దారిలోనే ఆ చర్చి ఉంది. రెండు పల్లకీలను కొందరు జనాలు చుట్టుముట్టడం నా దృష్టికి వచ్చింది. ఆ జనాల్లో కొందరు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారు ఆ బోయీల్లో ఒకరిని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. కాసేపటి తర్వాత పల్లకీలతో సహా అందరూ జిల్లా కమాండింగ్ అధికారి కార్యాలయం వద్దకు వెళ్లారు.
పల్లకీ నుంచి దిగిన మెకాలే, మరో వ్యక్తితో కలిసి కార్యాలయంలోకి వెళ్లారు. కాసేపటికే వారు బయటికి వచ్చేశారు. ఆపై మెకాలే తన పరివారంతో మద్రాసు పయనమయ్యారు. అసలక్కడేమీ జరగనట్టుగా, ఆ జనాలు ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారు. ఎలాగోలా, ఆ గుంపుకు నాయకుడిలా వ్యవహరించిన వ్యక్తిని కలిసి కూపీ లాగాను.
"మెకాలీ దొరవారు మాకు రూ.100 ఇచ్చారు" అని ఆ వ్యక్తి వెల్లడించాడు. "ఆయన చాలా పెద్దమనిషి" అని కూడా ఆ వ్యక్తి కీర్తించాడు. ఆ రోజుల్లో రూ.100 అంటే ఊటీలో 100 ఎకరాల భూమి కొనవచ్చు. అంతపెద్ద మొత్తం అది. అంతడబ్బు ఇచ్చి మెకాలీ అక్కడ్నించి బయటపడ్డారు" అని ఫ్రాన్సిస్ లాసిల్లిస్ వివరించారు.