TDP: చూస్తుండగానే సగం మేర కరిగిపోయిన కొండ... వైసీపీ ధన దాహమే కారణమంటూ బండారు సెటైర్
- బండరాళ్లు జారడంతో కరిగిపోయిన కొండ
- 26 సెకన్ల నిడివి ఉన్న వీడియో
- వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ నేత బండారు
టీడీపీ యువ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు గురువారం మధ్యాహ్నం తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అంతెత్తున ఉన్న ఓ కొండ అలా చూస్తుండగానే సగం మేర కరిగిపోయింది. కొండపై ఉన్న బండరాళ్లు అలా విరిగి జారిపడిపోవడం ప్రారంభించగానే... క్షణాల్లో కొండలో దాదాపుగా సగం మేర కరిగిపోయింది.
ఈ దృశ్యాలను కొందరు యువకులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేయగా... ఆ వీడియోను అప్పలనాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'వైఎస్సార్సీపీ నాయకుల ధన దాహానికి కొండలు సైతం పిండి అవుతున్నాయంటూ' అప్పలనాయుడు ఈ వీడియోకు ఓ కామెంట్ యాడ్ చేశారు. అయితే, ఇది ఎక్కడ చోటుచేసుకుందన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.