UPI: మే నెలలో రూ.10 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు... రికార్డు నెలకొల్పిన యూపీఐ
- దేశంలో 2016 నుంచి యూపీఐ ఆధారిత సేవలు
- మే నెలలో 595 కోట్ల లావాదేవీలు
- ఏప్రిల్ లో 558 కోట్ల లావాదేవీలు
- డేటా విడుదల చేసిన ఎన్పీసీఐ
భారత్ లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) వ్యవస్థ తీసుకువచ్చిన తర్వాత తొలిసారిగా మే నెలలో అత్యధిక లావాదేవీలు చోటుచేసుకున్నాయి. దేశంలో 2016 నుంచి యూపీఐ అమల్లోకి వచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఆన్ లైన్ చెల్లింపులు, ఇతర లావాదేవీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో, మే నెలలో 595 కోట్ల యూపీఐ ఆధారిత లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ రూ.10 లక్షల కోట్లు కావడం విశేషం. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఈ స్థాయిలో లావాదేవీలు జరగడం యూపీఐ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. అంతకుముందు, ఏప్రిల్ నెలలోనూ గణనీయ స్థాయిలో 558 కోట్ల యూపీఐ ఆధారిత లావాదేవీలు జరిగినట్టు ఎన్పీసీఐ వెల్లడించింది.