Janasena: జనసేన పొత్తులు, పార్టీకి చిరంజీవి మద్దతుపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదన్న నాగబాబు
- ఆయన నైతిక మద్దతు జనసేనకే ఉంటుందని వ్యాఖ్య
- పొత్తులపై పవన్ ఎలా చెబితే అలా వెళతామని వెల్లడి
- సొంతంగా బలపడాలన్నదే తమ ప్రయత్నమన్న నాగబాబు
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి (పీఏసీ) సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం విజయనగరంలో ఆయన జనసేన కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్తులో తమ పార్టీ పొత్తులు, తమ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఏ తరహా వైఖరితో ఉన్నారన్న విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతానికి తమ సోదరుడు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదని నాగబాబు స్పష్టం చేశారు. చిరంజీవికి సినిమాలంటే ప్యాషన్ అని, సినిమాల్లోనే ఆయన కొనసాగాలనుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని కూడా చెప్పారు. అయితే నైతికంగా జనసేనకే చిరంజీవి మద్దతు ఉంటుందని నాగబాబు వెల్లడించారు. జనసేన పొత్తులు పార్టీ అధినేత హోదాలో పవన్ కల్యాణ్ ఎలా చెబితే అలా ముందుకు సాగుతామని చెప్పారు. అయితే సొంతంగానే తాము బలపడాలని ప్రయత్నిస్తున్నట్లు నాగబాబు వెల్లడించారు.