Andhra Pradesh: సినిమా టికెట్లపై కమీషన్‌ను ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం
- ప్రతి టికెట్‌పై 2 శాతం కమీషన్
- ఏపీఎస్ఎఫ్‌టీవీడీసీ ద్వారా టికెట్ల విక్రయం
- ప్రైవేటు యాప్‌ల ద్వారా కొనుగోలు చేసినా రెండు శాతం కమీషన్ చెల్లించాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇకపై ప్రతి టికెట్‌పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయనుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూలన సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు యాప్‌ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసినా ప్రభుత్వానికి రెండుశాతం కమీషన్ చెల్లించాల్సిందే.
కాగా, సినిమా టికెట్ల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు విక్రయించాలన్న ప్రతిపాదన ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVDC) ద్వారా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా టికెట్‌పై రెండుశాతం కమీషన్ తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.