Andhra Pradesh: ఇలాంటి నిబంధన బహుశా ఏ రాష్ట్రంలోనూ ఉండి ఉండదు: ఏపీ సర్కార్ పై చంద్రబాబు ఫైర్
- బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లొద్దంటూ సర్కార్ రూల్
- రాష్ట్రం పరువు పోయిందని చంద్రబాబు ఫైర్
- రూ.లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ అని మండిపాటు
- జగన్ వల్ల లక్షల ఉద్యోగాలు పోయాయని విమర్శ
బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లొద్దంటూ టెండర్లలో ప్రభుత్వం పెట్టిన నిబంధనపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ సర్కార్ మూడేళ్ల పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందని విమర్శించారు. బిల్లుల కోసం కోర్టులకు వెళ్లరాదంటూ టెండర్లలో నిబంధనలు పెట్టడం రాష్ట్ర దుస్థితికి, జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని ఫైర్ అయ్యారు.
కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల కోసం రూ.13 కోట్ల టెండర్ పనులకు పెట్టిన ఆ నిర్ణయం రాష్ట్ర పరువును తీసేసిందని, అసమర్థ పాలకులకు సిగ్గుగా అనిపించి ఉండకపోయినా.. ప్రభుత్వం నిజంగా సిగ్గుపడే నిర్ణయమని పేర్కొన్నారు. ఇలాంటి నిబంధనలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఉండి ఉండవన్నారు.
న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదన్న నిబంధన పెట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. బిల్లుల కోసం కోర్టుకు వెళ్లరాదన్న షరతులు పెట్టే స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రూ.లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, దాని వల్ల కాంట్రాక్టర్లు, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఎంత ప్రభావం పడుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదని విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణమయ్యారన్నారు. ‘‘రూ.13 కోట్ల పనులకే ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం.. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతుందా? ఎయిర్ పోర్టులు, స్టీల్ ప్లాంట్లు కడుతుందా? మూడు రాజధానులను నిర్మిస్తుందా?’’ అని చంద్రబాబు నిలదీశారు.
ముఖ్యమంత్రి వైఫల్యం వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదన్నారు. కోట్ల మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేయడం అభివృద్ధి అవుతుందా? అని ప్రశ్నించారు. అభివృద్ధి వైపు ప్రయాణించే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి ప్రజలకు జగన్ తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.