Adivi Sesh: మూవీ రివ్యూ: 'మేజర్'
- ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'మేజర్'
- మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా
- సందీప్ భార్య పాత్రలో సయీ మంజ్రేకర్
- సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకొచ్చిన దర్శకుడు
- కథ పుంజుకోవడంలో కాస్త ఆలస్యం
- మూడ్ లోకి తీసుకుని వెళ్లే గ్రౌండ్ స్కోర్
- హైలైట్ గా నిలిచిన ఫొటోగ్రఫీ
తెలుగులో ఈ మధ్య కాలంలో బయోపిక్ ల జోరు పెరుగుతూ వస్తోంది. అలా 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్' జీవితచరిత్ర ఆధారంగా 'మేజర్' సినిమా రూపొందింది. సోనీ పిక్చర్స్ .. ఏ ప్లస్ ఎస్ సంస్థలతో కలిసి హీరో మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మించారు. శశికిరణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.
కథలోకి వెళితే .. సందీప్ ఉన్నికృష్ణన్ ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తాడు. ఆయనకి సంధ్య అనే ఒక చెల్లెలు ఉంటుంది. ప్రేమానురాగాల పొదరిల్లులా ఆ కుటుంబం ఉంటుంది. సందీప్ తో మెడిసిన్ చేయించాలనేది తండ్రి కోరిక. అతనితో ఇంజనీరింగ్ చేయించాలనేది తల్లి కల. కానీ సందీప్ కి మాత్రం నేవీలో చేరాలని ఉంటుంది. కొన్ని కారణాల వలన ఆర్మీలో చేరతాడు. తల్లిదండ్రులు (ప్రకాశ్ రాజ్ - రేవతి)కి ఇష్టం లేకపోయినా చివరికి ఒప్పుకుంటారు.
కాలేజ్ లో ఇషా (సయీ మంజ్రేకర్) ప్రేమలో పడిన సందీప్, ఆమెను కూడా ఒప్పించి ఆర్మీలో చేరతాడు. ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటాడు. తండ్రి బిజినెస్ పనులతో బిజీగా ఉండటం .. తల్లి కిట్టీ పార్టీల పేరుతో ఇంటిపట్టున ఉండకపోవడంతో చిన్నప్పటి నుంచి ఇషా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అందువలన ఆమె తన దగ్గరే సందీప్ ఉండాలని భావిస్తుంది. ఒకానొక సమయంలో ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న సందీప్ పై అధికారి నుంచి సెలవు తీసుకుంటాడు. అదే సమయంలో ముంబైలోని హోటల్ తాజ్ పై ఉగ్రదాడి జరుగుతుంది.
అంతే .. తన సెలవును కూడా రద్దు చేసుకుని సందీప్ రంగంలోకి దిగుతాడు. తీవ్రవాదులు ఆ హోటల్లోని ప్రతి గది గదినీ గాలించి మరీ అందరినీ కాల్చి చంపేస్తూ ఉంటారు. వాళ్ల బారి నుంచి అందరినీ కాపాడటం కోసం తన టీమ్ తో కలిసి సందీప్ ధైర్యంగా హోటల్ లోకి అడుగుపెడతాడు. ఆ తరువాత అక్కడ చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి? ప్రాణాలకు తెగించి ఆయన ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనేదే కథ.
26/11 .. ముంబైలోని హోటల్ తాజ్ పై జరిగిన ఉగ్రదాడిలో సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణత్యాగం చేయడం భారతీయులను కదిలించివేసింది. అయితే ఆయన బాల్యం .. టీనేజ్ .. ప్రేమలో పడటం .. తన కుటుంబ సభ్యులతో తనకి గల అనుబంధం .. దేశం పట్ల ఉన్న భక్తిని గురించి చాలామందికి తెలియదు. 'ఆయన ఎలా చనిపోయారనేది అందరికీ తెలుసు .. ఎలా బ్రతికారనేది ఈ సినిమా చూపిస్తుంది' అని ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ చెప్పాడు. నిజంగానే హోటల్ తాజ్ ఆపరేషన్ కి ముందు సందీప్ అంటే ఏమిటనే ప్రశ్నకి సమాధానంగానే ఈ కథ నడుస్తుంది.
దర్శకుడు శశికిరణ్ తిక్కా .. ఈ కథను ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రాసుకున్న తీరు బాగుంది. కథని ఎక్కడి నుంచి ఎలా చెప్పాలో .. అక్కడి నుంచి అలాగే మొదలుపెట్టి .. ఎక్కడ ఆపాలో అక్కడే ఆపాడు. ఈ మధ్యలో సందీప్ లవ్ .. ఎమోషన్స్ .. యాక్షన్ ను సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించాడు. చాలా తక్కువ సమయంలో పాత్రల నుంచి మంచి ఎమోషన్స్ ను రాబట్టాడు. హోటల్ తాజ్ లో నిజంగా జరుగుతున్న సన్నివేశాలను చూసినట్టుగా ఉంటుందే తప్పా, సినిమా చూస్తున్నట్టుగా ఎక్కడా అనిపించదు. అయితే కథ పుంజుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. అక్కడ ఫీలింగ్స్ ను రాబట్టినప్పటికీ .. కాస్త స్లో అయినట్టుగా అనిపిస్తుంది.
హోటల్ తాజ్ పై దాడి ఎపిసోడ్ లో, చుట్టూ భయాందోళనల్లో జనాలు .. ఎటు చూసినా కాల్పుల మోతలు .. బాంబుల శబ్దాలు .. హోటల్లో తీవ్రవాదుల బారిన పడకుండా మిగతా వారిని రక్షించాలి .. అదే సమయంలో తీవ్రవాదులను మట్టుబెట్టాలి .. అందు కోసం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. కొడుకు ఈ ఆపరేషన్ లో ఉన్నాడని తెలిసి తల్లిదండ్రుల టెన్షన్ .. మరో వైపున సందీప్ భార్య ఆందోళన .. ఇలా అన్నివైపుల నుంచి అన్ని పాత్రల వైపు నుంచి సీన్స్ ను టైట్ చేస్తూ .. ప్రేక్షకులను ఉత్కంఠకు .. ఉద్వేగానికి లోనయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
'మేజర్' పాత్రలో ఎక్కడా కూడా అడివి శేష్ కనిపించడు .. సందీప్ ఉన్నికృష్ణన్ మాత్రమే కనిపిస్తాడు. తన పాత్ర నుంచి సందర్భానికి తగినట్టుగా కావలసిన అన్ని రకాల ఎమోషన్స్ ను ఆయన అద్భుతంగా పలికించాడు. ఆ పాత్రను ఆయన ఎంతగా ఓన్ చేసుకున్నాడనేది ప్రతి సీన్లో తెలిసిపోతూనే ఉంటుంది. సయీ మంజ్రేకర్ నిండుగా కనిపిస్తూ .. కళ్లతోనే చక్కని హావభావాలను పలికించింది. ఇక తమ కొడుకు విషయంలో ఆరాటపడే సన్నివేశంలోను .. ఆయన ఇక లేడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులుగా ప్రకాశ్ రాజ్ - రేవతి నటన కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఇక సందీప్ పైఆఫీసర్ పాత్రలో మురళీశర్మ .. తీవ్రవాదుల పాత్రలను పోషించిన యువకులు .. తీవ్రవాదుల బారి నుంచి బయటపడిన యువతిగా శోభిత ధూళిపాళ .. అంతా కూడా తమ పాత్రలలో నుంచి బయటికి రాకుండా చేశారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్ లోకి తీసుకుని వెళుతుంది. అలాగే 'హృదయమా' అనే పాట మనసులను సున్నితంగా టచ్ చేస్తుంది. ఇక వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం చెప్పుకోదగినది. కశ్మీర్ నేపథ్యంలోని సీన్స్ .. పాకిస్థాన్ బోర్డర్ నేపథ్యంలోని సీన్స్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. అబ్బూరి రవి సంభాషణలు .. ఎడిటింగ్ కూడా బాగున్నాయి.
కథ .. కథనం .. చిత్రీకరణ .. సంగీతం .. ఫొటోగ్రఫీ .. ప్రధానమైన పాత్రల నుంచి రాబట్టిన నటన పరంగా చూసుకుంటే, ఈ బయోపిక్ ఒక అభినందించదగిన ప్రయత్నంగానే కనిపిస్తుంది. ప్రేక్షకులకు ఎంత మాత్రం అసంతృప్తిని కలిగించదనే అనిపిస్తుంది. అడివి శేష్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
--- పెద్దింటి గోపీకృష్ణ