TPCC President: అమెరికాలో రేవంత్ రెడ్డి... వేల ఎకరాల వ్యవసాయ క్షేత్రం పరిశీలన
- తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై శాఖ ఆహ్వానం మేరకు అమెరికాకు రేవంత్
- శుక్రవారం డల్లాస్‌లో పర్యటన
- 6 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మైక్ ఫల్లాన్‌తో భేటీ
- సాగు పద్ధతులపై ఫల్లాన్‌తో రేవంత్ చర్చ
- మంచి అనుభవం అంటూ ట్వీట్ చేసిన టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై శాఖ ఆహ్వానం మేరకు రేవంత్ అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం డల్లాస్ వెళ్లిన రేవంత్ రెడ్డి...అక్కడ ఉన్న ఓ భారీ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
డల్లాస్‌కు చెందిన మైక్ ఫల్లాన్ ఏకంగా 6 వేల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ ఫల్లాన్‌తో ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫల్లాన్ అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. అక్కడి వ్యవసాయ విధానాలు, సాగుకు అయ్యే ఖర్చు, పంటల బీమా, సాగుకు అమెరికా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, సాగు రంగాన్ని ఆ దేశ ప్రభుత్వం కాపాడుకుంటున్న తీరును ఫల్లాన్ను అడిగి తెలుసుకున్నారు. ఇది ఓ మంచి అనుభవం అంటూ రేవంత్ వెల్లడించారు.