Budda Venkanna: బుర్ర తక్కువ అంబటీ... విషయజ్ఞానం పెంచుకో!: బుద్ధా వెంకన్న విమర్శనాస్త్రాలు

Budda Venkanna criticizes minister Ambati on Polavaram project

  • జగన్ ధనయజ్ఞం పోలవరానికి శాపం అన్న వెంకన్న 
  • పైసల కక్కుర్తి వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని వ్యాఖ్యలు
  • రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.146 కోట్ల ప్రజాధనం వృథా అయిందని విమర్శ 

వైసీపీ మంత్రులు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలపై టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడుల తీవ్రతను పెంచారు. తాజాగా నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుర్ర తక్కువ అంబటీ...  శాఖపై విషయజ్ఞానం పెంచుకో అంటూ హితవు పలికారు. జగన్ రెడ్డి ధనయజ్ఞం వల్లనే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 

పైసల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ కు వెళుతుంటే కేంద్రం వద్దని మొత్తుకుందని వెల్లడించారు. ప్రాజెక్ట్ దెబ్బతింటుందని హెచ్చరించినా వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా, తక్కువ రేటుకే ప్రాజెక్టు నిర్మాణం ఆగమేఘాల మీద పూర్తిచేస్తామని రాతపూర్వకంగా తెలిపిందని వివరించారు. 

పోలవరం హెడ్ వర్క్స్ పూర్తి చేసేందుకు రూ.1,771 కోట్లు అవసరమైతే, రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1,548 కోట్లకే 24 నెలల్లోనే పనులు పూర్తిచేస్తామని, రూ.223 కోట్ల ప్రజాధనం మిగిలిపోయిందని హడావుడి చేశారని ఆరోపించారు. ఆఖరికి ఇప్పుడు ఆ వ్యయం రూ.1,917 కోట్లకు పెరిగిపోయిందని బుద్ధా వెల్లడించారు. అంచనా కంటే రూ.146 కోట్ల ప్రజాధనం రివర్స్ టెండరింగ్ ద్వారా వృథా అయిందని విమర్శించారు. 

2019 నవంబరులోనే కొత్త కంపెనీకి పనులు అప్పజెప్పారని తెలిపారు. నవంబరులో వరద లేనప్పుడే పనులు పూర్తి చేసి ఉంటే కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యేదని అభిప్రాయపడ్డారు. అసలు, ఈసీఆర్ఎఫ్ కట్టి ఉంటే డయాఫ్రం వాల్ దెబ్బతినేది కాదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 2019లో 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని, అప్పుడు కూడా డయాఫ్రం వాల్ నిలబడిందని వెల్లడించారు. 2020లో 23 లక్షల క్యూసెక్కుల వరద రావడంతోనే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని వివరించారు. జగన్ ధనయజ్ఞం పోలవరానికి శాపంలా మారిందని బుద్ధా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News