S Jai Shankar: యూరప్ దేశాలు తమ మైండ్ సెట్ మార్చుకోవాలి: విదేశాంగ మంత్రి జైశంకర్
- ఉక్రెయిన్ అంశంలో తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్
- విమర్శిస్తున్న యూరప్ దేశాలు.. బదులిచ్చిన జైశంకర్
- భారత్ ఏ పక్షానికి కొమ్ముకాయదని స్పష్టీకరణ
ఉక్రెయిన్ పై రష్యా దండెత్తిన నేపథ్యంలో భారత్ అవలంబిస్తున్న తటస్థ వైఖరిని యూరప్ దేశాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తుండడం పట్ల కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. చైనా అవలంబిస్తున్న హానికర వైఖరిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని భారత్ కోరుకుంటున్నట్టయితే, ఉక్రెయిన్ పరిస్థితి పట్ల భారత్ కూడా మాట్లాడాలన్న యూరప్ వాదనను జైశంకర్ తిరస్కరించారు. ఉక్రెయిన్ సమస్య ఇటీవల సంభవించిందని, అంతకంటే చాలాముందే చైనాతో తమ ప్రతిష్టంభన చోటుచేసుకుందని వివరించారు.
యూరప్ ఇకనైనా ఎదగాలని, తన మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. యూరప్ దేశాలు తమ సమస్యను ప్రపంచ సమస్యగా రుద్దాలని భావిస్తున్నాయని ఆరోపించారు. కానీ అదే సమయంలో ప్రపంచ సమస్యలను మాత్రం యూరప్ తన సమస్యలుగా భావించడంలేదని జైశంకర్ విమర్శించారు. భారత్ ఏ పక్షానికి కొమ్ముకాయదని, భారత్ కు సొంత ప్రాధాన్యతలు ఉన్నాయని స్పష్టం చేశారు.