Hyderabad: మే 28న‌ గ్యాంగ్ రేప్ జ‌రిగితే 31న ఫిర్యాదు చేశారు: వెస్ట్ జోన్ డీసీపీ జోయ‌ల్ డేవిస్‌

west zone dcp Joel Davis releases details of gang rape

  • గ్యాంగ్ రేప్‌లో మొత్తం ఐదుగురు నిందితులున్నారన్న డీసీపీ 
  • ఐదుగురిలో ఇద్ద‌రు మేజ‌ర్లు, ముగ్గురు మైన‌ర్లని వెల్లడి 
  • 48 గంట‌ల్లో ఓ నిందితుడిని ప‌ట్టుకున్నామని వివరణ 
  • ఇంకో మైన‌ర్ అత‌డి కుటుంబ స‌భ్యుల క‌స్ట‌డీలోనే వున్నాడన్న డీసీపీ 
  • హోం మంత్రి మ‌న‌వ‌డు ఉన్నాడ‌న్న‌ది అవాస్త‌వమని వెల్లడి 
  • ఎమ్మెల్యే కొడుకు ప్రమేయంపైనా ఆధారాలు లేవన్న డీసీపీ

హైద‌రాబాద్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన బాలిక‌పై గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌కు సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ జోయ‌ల్ డేవిస్ శుక్ర‌వారం రాత్రి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో హోం మంత్రి మ‌న‌వ‌డు ఉన్నాడ‌న్న కోణంలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో హోం మంత్రి మ‌న‌వ‌డు ఎక్క‌డా క‌నిపించ‌లేదని డీసీపీ తెలిపారు. 

మే నెల 28న గ్యాంగ్ రేప్ జ‌రిగితే... మే 31న బాధితురాలి తండ్రి వ‌చ్చి త‌మ‌కు ఫిర్యాదు చేశార‌ని డీసీపీ చెప్పారు. గ్యాంగ్ రేప్ కార‌ణంగా బాలిక రెండు రోజుల పాటు షాక్‌లో ఉంద‌ని, ఈ కార‌ణంగా ఆల‌స్యంగా ఫిర్యాదు చేస్తున్న‌ట్లు చెప్పార‌న్నారు. దీంతో బాలిక‌కు మ‌హిళా కానిస్టేబుళ్ల‌తో కౌన్సిలింగ్ ఇప్పించామ‌ని ఆయ‌న తెలిపారు. ఆ త‌ర్వాత బాధితురాలిని విచారించ‌గా... త‌న‌పై ఐదుగురు అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లుగా చెప్పింద‌న్నారు. అయితే వారిలో ఒక్కరి పేరు మాత్ర‌మే బాలిక చెప్ప‌గ‌లిగింద‌న్నారు. 

బాధితురాలు తెలిపిన వివరాల మేర‌కు ద‌ర్యాప్తు మొద‌లుపెట్టి... ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు నిందితుల‌ను గుర్తించామ‌ని డీసీపీ తెలిపారు. వారిలో ఇద్ద‌రు మేజ‌ర్లు కాగా, ముగ్గురు మైన‌ర్లు ఉన్నార‌న్నారు. ఫిర్యాదు అందిన 48 గంట‌ల్లోగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని, మ‌రో మైన‌ర్ నిందితుడిని అత‌డి కుటుంబ స‌భ్యుల క‌స్ట‌డీలోనే ఉంచామ‌ని తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితుల‌ను 48 గంట‌ల్లోగా అదుపులోకి తీసుకుంటామ‌ని డీసీపీ చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యే కుమారుడి ప్ర‌మేయానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవ‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News