Mohammad Azharuddin: కోహ్లీకి బాసటగా నిలిచిన అజారుద్దీన్
- మూడేళ్లుగా కోహ్లీ పేలవ ప్రదర్శన
- 2019 నుంచి ఒక్క సెంచరీ కూడా సాధించని వైనం
- ఇటీవల ఐపీఎల్ లోనూ అదే తీరు
- అదృష్టం కూడా కలిసి రావాలన్న అజర్
- ఒక్క భారీ ఇన్నింగ్స్ తో పరిస్థితి మారిపోతుందని వ్యాఖ్య
గత మూడేళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడానికి సతమతమవుతున్నాడు. 2019 నుంచి ఏ ఫార్మాట్ లోనూ కోహ్లీ సెంచరీ సాధించింది లేదు. దానికి తోడు టీమిండియా పరాజయాలు కోహ్లీని నాయకత్వం కోల్పోయేలా చేశాయి. ఇటీవల ఐపీఎల్ లోనూ కోహ్లీ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండడంతో విమర్శకులు తమ అస్త్రాలకు మరింత పదునుపెట్టారు.
అయితే, ఫామ్ లో లేక ఇబ్బందులు పడుతున్న కోహ్లీకి మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ నుంచి మద్దతు లభించింది. కోహ్లీ అద్భుతరీతిలో పుంజుకోవడం ఖాయమని అజర్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఒక భారీ ఇన్నింగ్స్ తో పరిస్థితి మొత్తం మారిపోతుందని పేర్కొన్నారు.
కోహ్లీ గతంలో ఆడిన అద్భుత ఇన్నింగ్స్ లతో తనకు తానే ఉన్నత ప్రమాణాలను నిర్దేశించుకున్నాడని, అందుకే ఇప్పుడతడు 50 పరుగులు చేసినా ప్రజలకు అదేమంత పెద్ద స్కోరుగా కనిపించడంలేదని అజ్జూ భాయ్ విశ్లేషించారు. అర్ధసెంచరీ సాధించినా కోహ్లీ విఫలమయ్యాడనే అంటున్నారని వివరించారు.
ప్రతి క్రికెటర్ కెరీర్ లో ఇలాంటి పరిస్థితులు రావడం సాధారణమేనని అన్నారు. అత్యుత్తమ ఆటగాళ్లు సైతం ఇలాంటి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్న వారేనని అభిప్రాయపడ్డారు. కోహ్లీ టెక్నిక్ లో ఎలాంటి లోపాలు కనిపించడంలేదని, కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసిరావాలని అజర్ పేర్కొన్నారు. ఒక్కసారి ఓ భారీ సెంచరీ సాధిస్తే చాలు... కోహ్లీలో మునుపటి ఆత్మవిశ్వాసం చూడొచ్చని వివరించారు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ లో కోహ్లీ 16 మ్యాచ్ ల్లో 341 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కేవలం రెండు అర్ధసెంచరీలు మాత్రమే ఉన్నాయి.