India: దేశంలో మంకీ పాక్స్ కలకలం.. ఐదేళ్ల చిన్నారి నమూనాల సేకరణ
- యూపీలోని ఘజియాబాద్ చిన్నారికి లక్షణాలు
- పగుళ్లు, దురద, దద్దుర్ల వంటి సమస్యలు
- నమూనాలు టెస్టుల కోసం పంపిన అధికారులు
ఇన్నాళ్లూ అమెరికా, యూరప్ దేశాల్లోనే పాకిన మంకీపాక్స్.. ఇప్పుడు మన దేశంలోకీ ప్రవేశించిందా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ చిన్నారి నమూనాలను అధికారులు సేకరించి, పరీక్షల కోసం పంపారు.
ఆ చిన్నారికి చర్మం పగుళ్లు, దురద, దద్దుర్ల వంటి లక్షణాలు వచ్చాయని, ఆమెకి ఇంతకుముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. గత నెలరోజుల్లో విదేశాలకు వెళ్లి వచ్చిన దాఖలాలూ లేవన్నారు. ప్రస్తుతానికి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ముందు జాగ్రత్త చర్యగా టెస్టులకు పంపామని తెలిపారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా 700కుపైగా మంకీపాక్స్ కేసులు వచ్చాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిన్న ప్రకటించింది. అమెరికాలో 21 మంది దాని బారిన పడినట్టు వెల్లడించింది. కెనడాలో 77 మందికి అది సోకింది.
మశూచి (స్మాల్ పాక్స్)తో పోలిస్తే మంకీపాక్స్ అంత తీవ్రమైన వ్యాధి ఏం కాదని నిపుణులు చెబుతున్నారు. అరుదైన ఈ వ్యాధికి సంబంధించి దద్దుర్లు, జ్వరం, వణుకుడు, నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికాకే పరిమితమైన ఈ వ్యాధి.. మేలో యూరప్ దేశాలకు పాకింది. అక్కడి నుంచి అమెరికా, కెనడాలకూ వ్యాపించింది.